Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చార్సీ,జిరే కేర్ ఫౌండేషన్ అవగాహనా కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
హెచ్ఐవీ రాకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (హెచ్చార్సీ), జిరే కేర్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో హెచ్ఐవీ, ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్చార్సీ సౌత్ ఇండియా అధ్యక్షులు ఆర్.ఎస్.జె.థామస్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు షీబా, జీవనం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కె.దేవానంద్ బాబు, డైరెక్టర్ కె.ప్రశాంతి తదితరులు మాట్లాడారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ కొత్త హెచ్ఐవీ కేసులు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సురక్షిత లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు. ఎక్కువ మంది భాగస్వాములను కలిగి సురక్షిత లైంగిక విధానాలను పాటించని వారి ద్వారా ఎక్కువ మందికి సోకుతుందని చెప్పారు. ఇలాంటి వారికి పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడం ద్వారా వారికి జీవనభద్రతతో పాటు సమాజాన్ని హెచ్ఐవీ నుంచి కాపాడవచ్చని తెలిపారు.