Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ డెత్ సర్టిఫికెట్లతో క్లెయిమ్ చేయడానికి ఎత్తులు
- ఫిర్యాదులు రావడంతో అధికారుల పరిశీలన
- అయినా ఆగని దందా
- పట్టించుకోని కార్మిక శాఖ ఉన్నతాధికారులు
- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన సంక్షేమబోర్డు అక్రమార్కులు, పైరవీకారులకు అడ్డాగా మారింది. కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం పనిచేయాల్సిన బోర్డు బోగస్ లబ్దిదారులు, అవినీతిపరులకు కొమ్ముకాస్తోంది. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(బీసీఓడబ్ల్యూ)లో నిధుల గోల్మాల్ కొనసాగుతోంది. నకిలీ డెత్సర్టిఫికెట్లను సృష్టించి బోగస్ లబ్దిదారుల పేరుతో నిధులు కాజేయాలని కుట్రలు చేస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో అధికారులు పరిశీలించి అంతా బోగస్ అని తేల్చారు. అయినా అవినీతి అధికారులపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అంతా బోగస్
కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కార్మికశాఖలోని కొందరు అధికారులు దళారులతో కుమ్మకై తప్పుడు ధృవపత్రాలతో బోగస్ లబ్దిదారులను సృష్టించి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో బోగస్ డెత్ సర్టిఫికెట్లు సమర్పించి సహజ మరణాల కింద లక్షలాది రూపాయలు కాజేశారు. 80 డెత్ సర్టిఫికెట్లపై ఫిర్యాదు రావడంతో 15 సర్టిఫికెట్లను పరిశీలించారు. సర్టిఫికెట్లన్నీ బోగస్ అని తేలినా అధికారులు నిధులు విడుదల చేశారంటే పైరవీదారుల సత్తా ఏ స్థాఇలో ఉందో చెప్పనక్కర్లేదు. సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఇతర జిల్లాల్లో వందల సంఖ్యలో బోగస్ క్లెయిమ్స్‌తో నిధులను దారిమళ్లిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడంలేదు. వరంగల్ జిల్లాలో లబ్దిదారులకు రెండుసార్లు చెల్లింపులు జరిపిన ఘటనలో రూ.64 లక్షలు నష్టం జరిగిందని అధికారుల విచారణ తేలడంతోపాటు వారంతా బోగస్ లబ్దిదారులని గుర్తించారు. దాంతోపాటు మీసేవా కేంద్రంతో కుమ్మకై బోగస్ గుర్తింపు కార్డులు సృష్టించి బోగస్ లబ్దిదారులకు రూ.30కోట్ల వరకు చెల్లించినట్టు అధికారుల దృష్టికి రావడంతో విచారణ కమిటీ వేశారు. కాని ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకున్నదాఖల్లేవు.
అటకెక్కిన సర్కార్ ఆదేశాలు
ఆయా ప్రభుత్వ శాఖల్లో ఫిక్డ్స్ డిపాజిట్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను కార్మికశాఖ అటకెక్కించింది. తెలుగు అకాడమీలో జరిగిన నిధుల గోల్మాల్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.18ని జారీచేసింది. ఎఫ్డీలను 3 బ్యాంకులకు మించి పెట్టకూడదని సూచించింది. కానీ కార్మికశాఖ మాత్రం రూ.1000 కోట్ల నిధులను ఏడు బ్యాంకుల్లో 150కిపైగా బ్రాంచ్‌ల్లో 450కిపైగా ఎఫ్డీలను పెట్టారు.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా
తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(బీసీఓడబ్ల్యూ)లో నిధుల గోల్‌మాల్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు అప్రమత్తమయ్యారని తెలిసింది. వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన అవినీతిపై నివేదిక కోరినట్టు తెలిసింది. దాంతోపాటు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు సైతం బోగస్ క్లెయిమ్‌లపై సీరియస్‌గా ఉన్నారని, త్వరలోనే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(బీసీఓడబ్ల్యూ)లో అవకతవకలను ఆపాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వెల్ఫేర్బోర్డులోని నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చుచేయాలని కోరారు.