Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్క్‌ఫోర్స్ దాడి ఘటనతో రగులుతున్న కారుచిచ్చు
- ఫ్యాక్షన్ తరహాలో ఘర్షణలు
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
నవతెలంగాణ-శాయంపేట
హనుమకొండ జిల్లా పట్టణంలో ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ దాడి సంఘటన వెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉందని భావిస్తూ బాధిత కుటుంబ సభ్యులు అతనిపై దుర్భషలాడారు. ఆదివారం గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడానికి స్థానిక ప్రజా ప్రతినిధి సిద్ధపడగా బాధిత కుటుంబ సభ్యులు, ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో చిలికి చిలికి గాలి వానలా మారింది. ఫ్యాక్షన్ సినిమా తరహాలో ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు గొడవపడుతున్న వారిని అదుపులోకి తీసుకొని అందరిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేసిన ఘటన ఆదివారం స్థానిక బస్టాండ్ కూడలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హనుమకొండ పట్టణంలో ఇటీవల వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. పట్టుబడ్డ వారిలో ఒకరు.. హన్మకొండ జిల్లా శాయంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మారపల్లి రవీందర్ కుమారుడు పీటర్. తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేకనే టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం ఇచ్చి తన కుమారుడిని పట్టించాడని రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈనెల 27న టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో పాల్గొని వెళ్తున్న ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్‌పై రవీందర్, అతని సోదరుడు దుర్భషలాడారు. అక్కడే ఉన్న గ్రామ పెద్ద జిన్నా ప్రతాప్ సేనారెడ్డి వారికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. తనను అకారణంగా దుర్భషలాడారని ఉప సర్పంచ్ పెద్దమనుషులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బస్టాండ్ సెంటర్లోని రియల్ ఎస్టేట్ షాపు వద్ద పెద్ద మనుషులు ఇద్దరిని పిలిపించడంతో రవీందర్, సుమన్‌కు మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణ ం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అందరిని చెదరగొట్టారు. వాణిజ్య సముదాయాలను మూసి వేయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ గొడవలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిమాణాలకు దారితీస్తాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.