Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్రమిస్తే 'ఐపీసీ' కొరడా
- విద్యుత్ కేంద్రాలు, పంప్హౌజ్లకూ భద్రత
- వరదల నిర్వహణకూ చట్టబద్ధత
- సర్కారు కసరత్తు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సాగునీటి ప్రాజెక్టుల ఆస్తుల రక్షణ, వరదల నిర్వహణ, పరిశ్రమల నుంచి సాగునీటి ఛార్జీల వసూలు, విద్యుత్ కేంద్రాలు, పంప్‌హౌజ్ తదితర అంశాలపై స్పష్టతతో కూడిన కొత్త సమగ్ర సాగునీటి చట్టం రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఇప్పటికే కసరత్తుకు శ్రీకారం చుట్టింది. పాత చట్టాల్లోని లోపాలను అధ్యయనం చేయడం, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న చట్టాలను పరిశీలించి పటిష్టమైన కొత్త చట్టాన్ని తయారుచేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని సైతం వాడుకోవాలని నిర్ణయించింది. దీనిపై సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల స్థాయిలో 2020లోనే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. పాతవి నాలుగు చట్టాలున్నా, అవీ లోపభూయిష్టంగా ఉన్నాయనీ, వాటితో ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కారం కావడం లేదనే భావనలో ఇటు సర్కారుతోపాటు అటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ తరుణంలో కొత్త సమగ్ర చట్టానికి ఊపిరిపోసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. తద్వారా సాగునీటి రంగంలో వస్తున్న అనవసర సమస్యలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో మందుకు సాగుతున్నది. ఈ చట్టంలో సాగునీటి శాఖతోపాటు ప్రాజెక్టుల ఆస్తులను రక్షించడానికి కావాల్సిన రక్షణలు కల్పించాలని ఆలోచిస్తున్నారు. విద్యుత్ కేంద్రాలు, పంపు హౌజ్‌లు, కాలువలు, ఆస్తుల రక్షణ కోసం అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సాగునీటి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గతనెలలో మీడియాకు తెలిపారు. పరిశ్రమలకు అందిస్తున్న నీటికి యూజర్్ ఛార్జీల వసూలుకు అవసరమైన నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచనున్నారు. ప్రాజెక్టు భూములను ఆక్రమిస్తే ఐపీసీ సెక్షన్ల ఆధారంగా కేసుల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. సాగునీటి శాఖ పరిధిలో 11 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అలాగే 1.25 కోట్ల ఎకరాలకు సాగునీటిని ఆయా ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్నారు. దాదాపు 80 శాతం భూములకు నీటి సరఫరా జరుగుతున్నది. మిగతా భూములకు భూగర్భజలాలపైనే ఆధారపడుతున్నారు. వరదల నిర్వహణా, భారీ సాగునీటి ప్రాజెక్టులను కొత్త చట్టం పరిధిలోకి తేవాలని సాగునీటి శాఖ యోచిస్తున్నది. కేరళ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మిర్ తదితర రాష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం సాగునీటి శాఖకు సూచించింది. 1947, 1965, 1984, 1994లో వచ్చిన సాగునీటి, రైతుల చట్టాలకు మార్పులు చేయడం ద్వారా కొత్త చట్టాన్ని రూపొందించాలని సర్కారు భావిస్తున్నది. ఈమేరకు వేగంగా కసరత్తు కొనసాగుతున్నది. గత సెప్టెంబరులో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో కొత్త చట్టం రూపకల్పన కోసం ప్రత్యేకంగా భేటి జరిగింది.
ఈ సందర్భంగా కొంతమేర కదలిక వచ్చింది. వచ్చే వారం రోజుల్లో మరోసారి సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పాత చట్టాల పక్కాగా పరిశీలించడం ద్వారా కొత్త చట్టానికి కోరలు తొడగాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఆదిశగానే కొత్త సమగ్ర సాగునీటి చట్టం రూపొందనుందని పేరు రాయడానిక ఇష్టపడని ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్ 'నవతెలంగాణ'కు తెలిపారు. త్వరలో కొత్త చట్టం కోసం సమావేశం జరగనుందని వివరించారు.