Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీల్లో దడ..
- ఓటర్ల చేత ప్రమాణాలు
- చివరి దశకు ప్రచారం..నాయకుల్లో హైటెన్షన్
నవతెలంగాణ-నల్లగొండ
మునుగోడు ఉపఎన్నిక ఘట్టం చివరి అంకానికి చేరింది. సమీకరణాలు, వలసలు, బేరసారాలు, నజరానాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల్లో హైటెన్షన్ మొదలైంది. గెలుపోటములపై ప్రభావం చూపే తటస్థ ఓటర్ల అంతరంగం తెలియకపోవడమే దీనికి కారణం. వీరంతా గుంభనగా ఉండటం.. కొన్ని సర్వేల్లో తటస్థుల ఓట్లు 11 శాతం దాకా ఉన్నట్టు తేలడం అభ్యర్థులు, పార్టీల నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
సాధారణ ఎన్నికల్లో తటస్థ ఓటర్ల ప్రభావం 2 నుంచి 3 శాతమే ఉంటుండగా.. మునుగోడు ఉపఎన్నికలో మాత్రం 11 శాతం ఉండటం.. అత్యంతకీలకమైన వీరు అంతరంగాన్ని బయటపెట్టడం లేదని సర్వే సంస్థలు తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కులాలు, సంఘాలు, సామాజిక అంశాలపైనే బేరీజు వేసుకుని దృష్టి సారించిన రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు సర్వే సంస్థల నివేదికల ఆధారంగా తటస్థ ఓటర్లను వలలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 15 రోజులుగా నియోజకవర్గంలో మకాం వేసిన రాజకీయ వ్యూహకర్తలు, సీనియర్ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో ఒక్కో తటస్థ ఓటరు విలువ మరింత ఖరీదుగా మారింది. ప్రచారానికి సమయం లేకపోవడంతో వారిని వ్యక్తిగతంగా కలుసుకుంటూ ప్రమాణాలు చేయిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు.
గెలుపు, ఓటమి తేడా ..
మునుగోడులో 2.42 లక్షల ఓట్లుండగా.. 70 నుంచి 75 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా. ఇందులో తటస్థులే కీలకం కానున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇలాగైతే తటస్థుల ఓట్లు ఎవరి కొంప ముంచుతాయోనని ప్రధాన పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు కరువైంది. ఏ పార్టీ వారు సభలు, సమావేశాలు పెట్టినా.. భారీగా, ఉత్సాహంగా వెళ్తున్నా కచ్చితంగా ఆ పార్టీకే ఓటేస్తామని గట్టిగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు అన్ని పార్టీల సమావేశాలకు ఇదే ఓటర్లు ప్రత్యక్షమవుతుండటం.. వారి అంతరంగం బయటపడకపోవడం నేతలకు ప్రధాన సమస్యగా మారింది. దీంతో గ్రామాలు, కాలనీల్లో ఓటర్లను ప్రభావితం చేసే చోటామోటా నాయకులను పిలిపించుకుని తటస్థుల మద్దతు కూడగట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. అయితే, ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఉపఎన్నికలో డబ్బు పంపిణీపై మొదటి నుంచి పెద్దఎత్తున జరిగిన ప్రచారమే. ఉపఎన్నిక నోటిఫికేషన్‌కు ముందు నుంచే రాజకీయ పరిస్థితులను గమనించిన ఓటర్లు కూడా మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఆశించారు. దాదాపు 2 నెలలుగా ఉపఎన్నికలో ఓటుకు రూ.40-50 వేలు లేదా తులం బంగారం ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ పంపకాల ప్రచారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తటస్థుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు కూడా కీలకంగా మారుతున్నారు. ఓటర్ల జాబితా ప్రకారం బంధువులు, పరిచయం ఉన్నవారి ద్వారా బేరసారాలు సాగిస్తూ ఓటుకు లెక్కగట్టి వారిని పోలింగ్ కేంద్రానికి తరలించేవరకు అన్నీ సమకూరుస్తున్నారు. గెలుపు ఓటముల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉండటంతో వీరిని ఎలాగైనా రప్పించేలా స్థానిక నేతలను పురమాయిస్తున్నారు.
అందరికీ జై అంటున్న ఓటర్లు
ప్రచార అంకం చివరిలోనూ ఓటర్ల నాడి అంతుచిక్కకపోవడంతో కీలకంగా మారిన తటస్థ, వలస ఓటర్లపై గురిపెట్టి పార్టీలు డబ్బు పంపకాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకే సామాజిక తరగతికి చెందినవారు. దీంతో తమ సామాజిక తరగతితోపాటు మిగతా కీలక ఓట్లపై ఆశలు పెంచుకున్నారు. బేరసారాలతో బేరీజు తర్వాతే తాము ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయించుకుంటామని కొంతమంది ఓటర్లు అంటున్నారు.