Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ ఆయుర్వేద మెడికల్ కాలేజీ దుస్థితి
- 67 పోస్టుల్లో 44 ఖాళీ..
- భవిష్యత్తు భయంతో ఆందోళనలో విద్యార్థులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోనే రెండో ప్రభుత్వ వైద్య కళాశాలగా వెలుగొందిన అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో సమస్యలు తిష్ట వేశాయి. దాంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) 63 సీట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థులు మూడ్రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ల్యాబ్ సిబ్బంది, పరికరాలు, కాలేజీ, ల్యాబ్‌లు, హాస్టళ్లులో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేండ్లుగా ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ పాలనలో బాలురు, బాలికలు కాలేజీలోనే కాకుండా హాస్టల్స్‌లోనూ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉండటంతో వీరి సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో కనీసం చేతి తొడుగులు కూడా లేవంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
1956లో వరంగల్‌లో ప్రారంభమైన అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించకపోవడంతో తిరోగమనంలో పయనిస్తుంది. ఈ వైద్య కళాశాల తొలినాళ్లలో ప్రయివేటు యాజమాన్యం (ఎయిడెడ్) ఆధ్వర్యంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభమైంది. పదేండ్ల తర్వాత కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.
తొలుత 30 సీట్లను అనుమతించగా, అనంతరం 50 సీట్లకు పెంచారు. ఈడబ్ల్యుఎస్ కోటా అమలు నేపథ్యంలో వైద్య కళాశాలలో 63 సీట్లున్నాయి. నాలుగేండ్లుగా 250 మంది విద్యార్థులు ఇక్కడ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసిస్తున్నారు. 2011 నుంచి ఆయుర్వేద ఆస్పత్రిలోనూ డాక్టర్ల నియామకాలు లేవు. దాంతో రోగులకే కాక, విద్యార్థులకు విద్యనభ్యసించడం కష్టతరంగా మారింది. కళాశాలలో 14 విభాగాలకుగాను బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి మొత్తం 67 పోస్టులుండగా, ఇందులో కేవలం 23 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 44 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ పాలనలో..
అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల కొన్నేండ్లుగా ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్తోనే నడుస్తోంది. 15 లెక్చరర్ పోస్టులకుగాను ఒక్క లెక్చరర్ కూడా లేకపోవడం గమనార్హం. 10 మంది ప్రొఫెసర్లుండాల్సి ఉండగా, కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కేవలం 4గురు మాత్రమే వున్నారు. 4 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. అలాగే, టైపిస్ట్, లైబ్రేరియన్, డ్రైవర్, హెర్బ్ కలెక్టర్, ఆఫీసు సబార్డినేట్, కుక్‌లు, వాచ్మెన్లు, స్వీపర్, స్కావెంజర్, ఎస్సీఎస్ పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. అంతేకాదు, ల్యాబ్‌లో వసతులూ కరువయ్యాయి. శల్య (సర్జరీ) విభాగం, శాలక్య (ఇఎన్‌టి) కౌమారబ్రియ (పేడియాట్రిక్), పంచకర్మ విభాగాల్లో అవసరమైన వసతులు, పరికరాలు లేవు. లైబ్రేరీలో కొత్త పుస్తకాలు లేకపోవడంతో ఆయుర్వేద వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
150 మంది బాలికలకు ఒకే వాష్‌రూమ్
ఆయుర్వేద వెద్య కళాశాలలో 150 మంది బాలికలకు కేవలం ఒకే ఒక్క వాష్‌రూమ్ ఉందంటే కళాశాల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 150 మంది బాలికలున్న కళాశాలలో 30మందికి మాత్రమే హాస్టల్లో సౌకర్యాలు ఉన్నాయి. దాంతో మిగతావారంతా ప్రయివేటు హాస్టళ్లలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. హాస్టల్‌కు వార్డెన్, వాచ్మెన్ లేకపోవడంతో రక్షణ కరువైంది. ఈవ్‌టీజింగ్‌కు బాలికలు గురవుతున్న దుస్థితి నెలకొంది. బెడ్స్, కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, లైట్లు సైతం లేవు. వంట మనిషి కూడా లేడు. హాస్టల్ సమీపంలోనే డంపింగ్ యార్డు ఉండటంతో తీవ్రమైన దుర్గంధంతో విద్యార్థినులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీకి ఎలాంటి బస్సు సౌకర్యం కూడా లేదు.
తాగునీరు లేదు..
బాలుర హాస్టల్లో తాగునీటి వసతి సైతం లేదు. హాస్టల్ ప్రాంగణం కుక్కలు, పందులకు ఆవాసంగా మారిందన్న విమర్శలున్నాయి. వంట మనిషి లేడు. ఫ్యాన్లు, లైట్లు లేవు. డ్రైనేజీ పైపుల లీకేజీలతో తీవ్ర దుర్గంధంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అంతర్గత రోడ్లు కూడా లేవు. బాలుర హాస్టల్లో 100 మందిలో 30 మంది హాస్టల్లో వుంటుండగా మరో 70 మంది ప్రయివేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు.