Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో శాశ్వత ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలి
- పలు మండలాల్లోని పోడు భూముల్లో అక్రమంగా ప్లాంటేషన్లు : ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లాలో వరద ముంపు గ్రామాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో శాశ్వత ఇండ్లు నిర్మాణాలు చేపట్టాలని, పోడు భూముల్లో ప్లాంటేష న్లను ఆపేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్, సహాయ కార్యదర్శి నిర్మ పున్నం డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న పోడు సర్వేలో అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్తాయిలో అమలు చేయడం లేదన్నారు. 2005కు ముందు సాగులో ఉన్న భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కొని ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కాటారం మండలంలోని మర్రిపెల్లి, దంతలపెళ్లి, బొప్పారం గ్రామాలకు సంబంధించిన పోచంపల్లి శివారులో ప్లాంటేషన్ చేశారు. ఆ గ్రామాల్లో 1996లో 118 మందిపై కేసులు పెట్టి జైలుపాలు చేశారని గుర్తు చేశారు. మహాదేవపూర్ మండలంలోని క్రిష్ణరావుపేట నిరుపేద ఆదివాసీ రైతులపై కేసులు పెట్టి భూమి లాక్కొని భూమి ప్లాంటేషన్ చేసిన క్రమంలో గ్రామాలను పోడు గ్రామాల జాబితాలో కలుపకుండా ఎఫ్ఆర్సీ కమిటీలు వేయకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అంబట్ పల్లి, కాళేశ్వరం, కన్నెపల్లి గ్రామాలు, మహాముత్తారం మండలంలోని పోలంపల్లి, మహాముత్తారం, పెగడపల్లి, పోచంపల్లి, కనుకునూరు, కాటారం మండలం శంకరంపల్లి ఆదివాసీ ప్రజలకు సంబంధించిన భూమిలో, మలహర్రావు మండలం దోమల మాచారం శివారు, రుద్రారం ప్లాంటేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పలిమెల మండలం లెంకలగడ్డ, వంతెన కు సంబంధించిన రెవెన్యూ శివారులో జేసీబీలతో గుంతలు తవ్వినట్టు ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వీరంతా అర్హులు కాబట్టి భూములు ఇప్పించి హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూదుల శంకర్, పొలం రాజేందర్, జిల్లా సహాయ కార్యదర్శి దయ్యం వినోద్, జిల్లా నాయకులు కుంజం బుధరం, మడకం, రామయ్య, పోలం చిన్న రాజేందర్, ఆదివాసీ రైతులు, తదితరులు పాల్గొన్నారు.