Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు
- రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చేకుట్రతోనే ఎమ్మెల్యేల కొనుగోలు
- మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యం నిర్వీర్యం
- బీజేపీ అధికారంలో ఉండడం దేశానికే అరిష్టం
- నల్లగొండ ఎర్రజెండా గడ్డ
- టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలి : తమ్మినేని
- మునుగోడులో నేడు మోటార్ సైకిల్ ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కమ్యూనిస్టులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ నాయకులు భరించలేకపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని వారికి అర్థమైంది. అందుకే మాపై నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు పేలుతున్నారు. టీఆర్ఎస్కు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. నిజాయితీగా ఉండే వామపక్షాల గురించి బీజేపీ నాయకులు ఆ విధంగా మాట్లాడ్డం దుర్మార్గం. అమ్ముడుపోయే చరిత్ర మాకు లేదు. రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు రాలేదనీ, రూ.18 వేల కోట్ల కాంట్రాక్టే వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి చెప్తున్నారు. ఇలాంటి అమ్ముడుపోయిన వారు పవిత్రమైన కమ్యూనిస్టులపై అభాండాలు వేయడం సరైంది కాదు. బీజేపీ నాయకులారా నోరు అదుపులో పెట్టుకోండి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి'అని సీపీఐ(ఎం) రాష్ట్ర తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్యతో కలిసి తమ్మినేని మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్టు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం అబద్ధమని విమర్శించారు. రాష్ట్రంలో పాగా వేయాలన్న బీజేపీ కుట్రలో భాగంగానే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనం చేసి రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని నిరూపించేందుకు ఈ ఎన్నికలను తెచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సాగిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు తెలియకుండానే కేంద్ర నాయకులు స్వామీజీలను పంపించిందన్నారు. ఏడెనిమిది రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చి కుట్రలు చేయడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోలేదా?అంటూ బండి సంజరు అంటున్నారనీ, వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ ఇలా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎవరు చేర్చుకున్నా ఖండించామని గుర్తు చేశారు. కానీ బీజేపీ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు తారాస్థాయికి చేరిందనీ, ప్రభుత్వాలను కూల్చడం అధికారంలోకి రావడమే ఆ పార్టీ లక్ష్యమని విమర్శించారు.
ఈడీ, సీబీఐతో ఎమ్మెల్యేలను లొంగదీసుకునే యత్నం
ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నదని తమ్మినేని చెప్పారు. గతనెల 20న మునుగోడులో సభలో 'మీరు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించండి. నెలరోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చుతాం'అంటూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఫాంహౌజ్‌లో కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిన వారు దొరికినా ప్రజలను క్షమాపణ కోరకుండా బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఇంకోవైపు దమ్ముంటే కమ్యూనిస్టులు పోటీ చేయాలంటూ బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని గుర్తు చేశారు. ఎక్కువ మంది పోటీ చేస్తే ఓట్లు చీలి బీజేపీ గెలుస్తుందనే భావనతోనే వ్యాఖ్యానించారని చెప్పారు. మునుగోడు కమ్యూనిస్టులకు బలమైన నియోజకవర్గమనీ, అందుకే గ్రామాల్లో బీజేపీ నాయకులను ప్రజలు అడ్డుకుంటున్నారని వివరించారు. దీన్ని గ్రహించి కమ్యూనిస్టులు తమకు శత్రువులు తమతోపాటు లెఫ్ట్ పార్టీలే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాయంటూ బండి సంజరు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దబ్బనాల పార్టీ, సూదుల పార్టీ, తోకపార్టీ అని కేసీఆర్ విమర్శించినా టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిచ్చారంటూ మరో నాయకుడు కమ్యూనిస్టు పార్టీలపై ఆరోపణలు చేశారని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయా?అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. అయితే తమను భవిష్యత్తులోనూ కేసీఆర్ విమర్శించే అవకాశం లేకపోలేదన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామనీ, కార్మికులకు కనీస వేతనాల జీవోలను సవరిస్తామనీ, ఇతర సమస్యలను పరిష్కరిస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు జరపకుంటే పోరాటాలు చేస్తామన్నారు.
మంచి చేస్తే మద్దతు... చెడు చేస్తే విమర్శ
సీఎం కేసీఆర్ ఏం చేసినా సమర్థించేది లేదని తమ్మినేని స్పష్టం చేశారు. మంచి చేస్తే మద్దతిస్తామనీ, చెడు చేస్తే విమర్శిస్తామని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం దేశానికే కాకుండా ప్రజలకు అరిష్టమని విమర్శించారు. పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతిచ్చామన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. బీజేపీని నిలువరించేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థను తేవడం, రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇలాంటి చర్యలను దేశభక్తి ఉన్న ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలనీ, ఆ పని కమ్యూనిస్టులు చేస్తున్నారని వివరించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులకుందన్నారు. నల్లగొండ ఎర్రజెండాకు అడ్డాఅని అన్నారు. ఈ గడ్డపై దేశానికే ప్రమాదకరమైన బీజేపీని ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. మంగళవారం మునుగోడులో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామనీ, తనతోపాటు ఇతర నాయకులు పాల్గొంటారని చెప్పారు.