Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర విధానాలతో రాష్ట్ర బీజేపీ నేతలకు తలబొప్పి
- టీఆర్ఎస్ దాడిని తట్టుకోలేని స్థితి
- మోటార్లకు మీటర్లు, చేనేతపై జీఎస్టీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన గులాబీ దళం
- అవగాహనా రాహిత్యంతో మాట్లాడి అబాసుపాలైన వైనం
'అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ...' ఈ తత్వం రాష్ట్ర బీజేపీకి ఇప్పుడు బాగా సరిపోతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని యత్నించి భంగపడ్డ ఆ పార్టీకి ఇప్పుడు ఇంటా బయటా తలనొప్పులు తప్పేట్టు లేవు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్నుగానీ, ఆ పార్టీ సీనియర్లను గానీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని గానీ సంప్రదించకుండా, వారికి తెలియకుండా ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చేపడుతున్న చర్యలు.. తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడి కమలనాథులకు శాపాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటు ప్రజల్లో పలుచనైపోయి.. అటు అధికార టీఆర్ఎస్ దాడిని ఎదుర్కోలేక ఆ పార్టీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు... 'అంతా మీ వల్లే... మీ వల్లే మాకీ తిప్పలు...' అని లోలోన తెగ ఇదై పోతున్నారన్నది పొలిటికల్ ఇండిస్టీ టాక్.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయటం, తద్వారా అక్కడి ప్రభుత్వాలను కూల్చటమనే విద్యలను యదేచ్ఛగా కొనసాగించిన బీజేపీ... చైతన్యవంతమైన తెలంగాణ గడ్డలో అదే పని చేయబోయి బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతలు కూసింత తెలివి తెచ్చుకుని, బుద్ధిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అత్యంత అవగాహనా రాహిత్యంతో మాట్లాడటం ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరింత అబాసుపాలయ్యారనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినబడుతున్నది. ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలంటూ కేంద్రం ఏనాడూ చెప్పలేదు, చేనేతపై జీఎస్టీ వేసినప్పుడు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆ ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారంటూ వారు వ్యాఖ్యానించటం వల్ల బీజేపీ మరింత అప్రదిష్టను మూటగట్టుకున్నదనే చర్చ కూడా కొనసాగుతున్నది. ఈ రెండు విషయాలపై హరీశ్‌రావు సోమవారం స్పష్టమైన వివరణివ్వటంతో కమలనాథుల నోళ్లు మూగబోయాయి. ఆ రెండూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. వాటి ద్వారా ఇప్పుడు ఈ ఇరువురు నేతలు, వారితోపాటు తెలంగాణ బీజేపీ పరివారం మొత్తం తలెత్తుకోలేని పరిస్థితి. అయితే ఒకవేళ బండి సంజయ్‌కు మోటార్లకు మీటర్లు, చేనేతపై జీఎస్టీ విధింపు గురించి తెలియకపోయినా ఫరవాలేదు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఆ విషయాలు తెలియకపోతే ఎలా..? అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు నిజంగానే తెలియదా..? లేక తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా..? అనే చర్చ సైతం ఇప్పుడు కొనసాగుతున్నది. మరోవైపు రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ అంటూ టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన వేళ... దానిపై కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమకు నచ్చని పార్టీలు, నేతలపై సీబీఐని, ఈడీనీ ఉసిగొల్పటం కేంద్రానికి, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి ఆనవాయితీగా మారిన తరుణంలో... ఆ విషయాన్ని ముందే పసిగట్టి 'సీబీఐకి నో' చెప్పామంటూ గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావటానికి రెండు రోజుల ముందు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలంటూ కమలం నేతలు కోరటమనేది... టీఆర్ఎస్ వర్గాల అంచనాలో నిజముందని చెప్పకనే చెబుతున్నది. సీబీఐ తమ జేబు సంస్థ కాబట్టి...'బేరసారాల' తతంగాన్ని దానికి అప్పజెబితే, ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చన్నది బీజేపీ నేతల వ్యూహంగా మనం భావించకతప్పదు. ఏతావాతా ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం అవమానాల పాలైందనేది కాదనలేని సత్యం.