Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- చట్ట సవరణ ప్రతులను దహనం చేయాలి
- సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవంబర్ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో అటవీ సంరక్షణ చట్టం సవరణ ప్రతులను దహనం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వల్లపు ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎస్కేఎమ్ రాష్ట్ర నాయకులు తీగల సాగర్, వేములపల్లి వెంకటరామయ్య, జక్కుల వెంకటయ్యలు మాట్లాడుతూ .. అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 2006 అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదపై హక్కులు కల్పించేందుకు యత్నిస్తున్నదన్నారు. చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలోనే కాకుండా అటవీ భూములు ఎక్కడున్నా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన పేదలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా బలవంతంగా రైతుల నుంచి భూములను గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా అమ్మేందుకు కేంద్రం పూనుకుంటున్నదని దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని రైతు సంఘాలు, ఆదివాసి, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలతో కలిపి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పి. జంగారెడ్డి, కోటేశ్వరరావు, మండల వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.