Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడాయన మీ పక్కనే ఉన్నారు..
- ఒకసారి అడిగి కనుక్కోండి : 'చేనేతకు జీఎస్టీ'పై మంత్రి హరీశ్‌రావు
- బండి సంజయ్, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేతపై జీఎస్టీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం చేసినప్పుడు అందుకనుగుణంగా తాను కూడా సంతకం పెట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 'చేనేతపై జీఎస్టీని 2017లో విధించారు... అప్పుడు ఆర్థిక మంత్రిని నేను కాదు.. ఆయనిప్పుడు మీ పక్కనే (ఈటల రాజేందర్) ఉన్నారు... కావాలంటే అడిగి కనుక్కోండి..' అంటూ సెటైర్లు విసిరారు. అప్పట్లో చేనేతపై జీఎస్టీని విధించొద్దంటూ ఈటల సైతం తమ ప్రభుత్వ విధానాన్నే స్పష్టం చేశారని హరీశ్ తెలిపారు. సంబంధిత ప్రింటెడ్ కాపీని ఆయన మీడియాకు విడుదల చేశారు. తమ పార్టీ రాష్ట్ర ప్లీనరీలో సైతం ఆ మేరకు తీర్మానించామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మెన్ కె.స్వామిగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభ జయప్రదమైందనీ, దాంతో బీజేపీకి దిమ్మ తిరిగిందని అన్నారు. ఆ క్రమంలో వారిలో అసహనం పెరిగి..నకిలి, మకిలీ మాటలు మాట్లాడుతు న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఏనాడూ చెప్పలేదంటూ కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారని విమర్శించారు. మీటర్లు పెట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రాష్ట్రాలకు సర్క్యులర్‌ను పంపిన విషయం వాస్తవం కాదా..? అది కిషన్‌రెడ్డికి తెలియదా..? అని ప్రశ్నించారు. సంబంధిత సర్క్యులర్‌ను హరీశ్ ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు తలెక్కడ పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తాం.. ఆ మేరకు అండర్ టేకింగ్ ఇస్తామనే విధంగా రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చింది నిజం కాదా..? అని నిలదీశారు. ఆ విధంగా మీటర్లు ఏర్పాటు చేస్తే రాష్ట్రాలకు మార్కులు వేస్తామంటూ కేంద్రం తెలిపిందని గుర్తు చేశారు. మీటర్లు పెడితే ఏడాదికి రూ.ఆరు వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో మొత్తం రూ.30 వేల కోట్లు ఇస్తామంటూ తెలిపిందని వివరించారు. అయినా రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టబోమంటూ సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్ల విషయంలో కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని హరీశ్‌రావు ఈ సందర్భంగా విమర్శించారు. మిషన్ భగీరథకు నిధులివ్వాలన్న నిటి అయోగ్ సిఫారసు లతోపాటు 15వ ఆర్థిక సంఘం సిఫారసులను సైతం తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో ఇప్పటి వరకూ 20 లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. తాము గ్రావిటీ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తూ రైతులకు మేలు చేసేందుకు ప్రయత్ని స్తుంటే... బీజేపీ నేతలు ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీబీఐ అనేది కేంద్ర జేబు సంస్థగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహరంతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేకపోతే ఆ పార్టీ నేతలు కోర్టుకెందుకు పోయారని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులపై బీజేపీకి నమ్మకం లేనప్పుడు తమ పార్టీకి మాత్రం సీబీఐపై ఎలా విశ్వాసముంటుందని ఆయన వ్యాఖ్యానించారు.