Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
- లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరిక
- త్వరలో సీఎం కేసీఆర్‌తో భేటీ : రాజేందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా, కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ఉద్యోగ సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీఎన్జీవో భవన్‌కు వివిధ కార్యాలయాల ఉద్యోగులు ప్రదర్శనగా వచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్, టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ మీడియాతో మాట్లాడు తూ అమ్ముడుపోయాయంటూ బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మూడుసార్లు ఇలాగే మాట్లాడితే ఆయన విచక్షణ కే వదిలేశామన్నారు. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగ సంఘాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుందని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి కడుపులో పెట్టుకుని కాపాడిన వ్యక్తి అనీ, ఉద్యమ బంధం, పేగుబంధమనీ, అది ఎన్నటికీ విడదీ యరానిదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఆదుకుంటున్నదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలేంటో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. ఉద్యమ కాలంలో తమ మెడపై కత్తి పెట్టినపుడు బీజేపీ నాయకులు ఏమయ్యారని ప్రశ్నించారు. ఉద్యోగుల శక్తి బీజేపీకి తెలుసనీ, ఉద్యోగులతో పెట్టుకున్న వాళ్లకు ఏం జరిగిందో తెలియంది కాదని చెప్పారు. తమ ఎన్నికల వివరాలను సంజయ్‌కి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నారని సూటిగా అడిగారు. ఆదాయపు పన్ను పరిమితి శ్లాబ్‌ను పెంచాలంటూ కేంద్రాన్ని కోరినా స్పందన లేదన్నారు. సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రం ఆ పని ఎందుకు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్రలను తిప్పికొడతామని అన్నారు. బేషరతుగా బండి సంజయ్ క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తమకు కారు అలవెన్స్ ఇవ్వాలని కోరారు. పీఆర్సీపై మళ్లీ కమిటీ వేయాలన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో సమా వేశమై అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్, టీజీవో అధ్యక్షురాలు వి మమత మాట్లాడు తూ బండి సంజయ్ ఉద్యోగ సంఘాలను అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసు కుంటున్నారని అన్నారు. పీఆర్సీ 2015లో 42 శాతం, 2021లో 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు అడిగినదాని కంటే ఎక్కువగానే ఇచ్చారని చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఉపయోగకరంగానే 317 జీవో తెచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, నాయకులు ముజీబ్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, నాయకులు ఎంబీ కృష్ణ యాదవ్, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.