Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యవస్థ లాగే అదీ భ్రష్టుపట్టింది
- మునుగోడులో మా కేడర్ ఓట్లు కూడా టీఆర్ఎస్కే...
- దానిపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థలాగానే అది కూడా పూర్తిగా భ్రష్టు పట్టిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తన రాజకీయ ప్రత్యర్థుల మీదికి ఉసిగొల్పేందుకే ఆ సంస్థ ఉపయోగపడుతున్నదని విమర్శించారు. 8 రాష్ట్రాల్లోకి ఆ సంస్థను రానివ్వబోమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపారు. మగ్దూంభవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఈటీ నర్సింహారావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మతో కలిసి ఆయన మాట్లాడారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతలంతా బీజేపీలో చేరగానే పునీతులు అవుతున్నారా...అని ప్రశ్నించారు. సుజనాచౌదరి, సీఎమ్ రమేష్ వంటి వారిపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయనీ, వారు బీజేపీలో చేరగానే ఆ కేసులు ఏమయ్యాయో కూడా తెలియట్లేదన్నారు. పలు కేసుల విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు కూడా సీబీఐ విచారణల్ని విశ్వసించకుండా తీర్పులు ఇచ్చిందని ఉదహరించారు. సీబీఐని నడిపించాలనుకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేసేలా చూడాలని సూచించారు. వాజ్‌పేయి కూడా ప్రధానిగా పనిచేశారనీ, అప్పట్లో ఆయన కొన్ని విలువలు పాటించారని అన్నారు. ఇప్పటి బీజేపీకి అలాంటివేమీ లేవనీ, రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ, రాజ్య విస్తరణకు అడ్డతోవలు తొక్కుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు యాదాద్రిలో ప్రమాణం చేయడాన్ని తప్పుపట్టారు. దొంగే... దొంగ దొంగ అన్నట్టే ఈ వ్యవహారం ఉందన్నారు. బీజేపీకి మనుధర్మంపై నమ్మకం లేదనీ, దాన్ని తాము అమలు చేయట్లేదంటూ బండి సంజరు ప్రమాణం చేయాలన్నారు. అలాగే ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తాము ఖర్చు చేయట్లేదని ప్రమాణం చేయాలన్నారు. రాజగోపాల్‌రెడ్డి కమ్యూనిస్టులపై విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టెండర్లలో బీజపీ గోల్మాల్ చేస్తుందని ఆయనే గతంలో స్వయంగా విమర్శలు చేశారనీ, ఇప్పుడు ఏ గోల్మాల్ చేస్తే ఆయనకు రూ.18వేల కోట్ల టెండర్లు దక్కాయని ప్రశ్నించారు. కమ్యూనిస్టులుగా తాము చేసే విమర్శలు పార్టీ విధాన, సిద్దాంతపరంగా ఉంటాయని స్పష్టం చేశారు. వామపక్షాల నాయకత్వం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా, వారి కేడర్ మాత్రం తమకే మద్దతు ఇస్తున్నదంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు క్రమశిక్షణ కలిగి ఉంటారనీ, కేడర్‌తో పాటు తమ పార్టీ సానుభూతిపరులు కూడా ఆ రెండు పార్టీలకు ఓట్లు వేయరని స్పష్టంచేశారు. కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.