Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆల్ ఇండియా మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ రెండో జాతీయ మహాసభలు ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఈ సభలకు ఆతిథ్యం ఇవ్వనున్నది. మహాసభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల హక్కులు, చట్టబద్ధ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మహాసభల పోస్టర్ ను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, అఖిల భారత మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ తదితరులు ఆవిష్కరించారు.
అనంతరం భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ స్కీం వర్కర్ల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని అమలు చేశాక బడి బయట పిల్లల సంఖ్య తగ్గి పాఠశాలల్లో నమోదు పెరిగిందని గుర్తుచేశారు. పేద పిల్లలు, ముఖ్యంగా దళిత, గిరిజన పిల్లలకు ఆహారం అందించే పథకం రావడంతో అప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న బాల కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా మోడీ సర్కారు కోత విధించిందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల పథకాన్ని ఇతర పథకాల్లో భాగంగా భావించి నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
గతంలో మధ్యాహ్న భోజన కార్మికులు స్థానికంగా దొరికే కూరగాయలు, ఇతర వస్తువులతో పోషకాహారాన్ని అందించే వారని గుర్తుచేశారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో మోడీ సర్కారు హరే రామ, హరే కృష్ణ, ఇస్కాన్, నాంది ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నదని తప్పుపట్టారు. ఆయా సంస్థలు పిల్లలకు శుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించడం లేదని ఆరోపించారు. కార్మికులకు నెలకు కేవలం రూ.1,000 మాత్రమే ఇస్తూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని తెలిపారు. మిడ్డే మీల్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలనీ, ఈ పథకాన్ని బలోపేతం చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమానికి ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కర్లు సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.