Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ
నవ తెలంగాణ-బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి బీట్లో బుడ్డగూడెం గ్రామానికి చెందిన పోడు రైతులు, అధికారుల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. రోజు రోజుకు ఈ బీట్లో పోడు వివాదం మరింత ముదురుతోంది. స్ఘానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోడు రైతులు అడవిలో మొక్కలను నరికివేశారన్న సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోడు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఓ మహిళకు గాయాలు కావడంతో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను 108 వాహనం ద్వారా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఓ ఫారెస్ట్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. బూర్గంపాడు తహసీల్దార్ భగవాన్ రెడ్డి, అదనపు ఎస్ఐ రమణారెడ్డి, జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పాల్వంచ ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సమయంలో పోడుదారులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. తమను అడ్డుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతామని బెదిరించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. కాగా 20 రోజుల కిందట మొక్కలు తొలగించిన ఘటనపై బుడ్డగూడెం గ్రామానికి చెందిన 26 మంది పోడుదారులపై అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం చోటుచేసుకున్న ఘటనపై మరల పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పాల్వంచ ఎఫ్ఆర్వో అనిల్ కుమార్ విలేకరులకు తెలిపారు.