Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్ట్ కార్డులను మోడీకి పంపిన నేతన్నలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత వస్త్రాలపై మోడీ ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని తక్షణమే ఉపసంహారిం చుకోవాలనీ, వారికి ఉరేస్తున్న మోడీ ప్రభుత్వమా కబడ్దార్ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధాని మోడీకి రాసిన లక్షలాది ఉత్తరాలను సోమవారం నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు వస్త్ర కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మెన్లు చింతా ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుదారాణి, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమూ ఈ విధంగా చేనేత వృత్తిపై పన్నుల భారాలను మోపలేదని తెలిపారు.మోడీ ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీని విధించి వారికి మరణ శాసనం రాసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం అత్యంత కీలకమైన ఆయుధంగా వాడిన చేనేత ఉత్పత్తులపైన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ విధించడం అత్యంత దారుణమన్నారు. పైగా ఐదు శాతం ఉన్న జీఎస్టీని చేనేత వస్త్రాలపై 12 శాతానికి పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందనీ, దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల వల్ల వాయిదా వేసిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన ఐదు శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న ఏకైక నినాదంతో రాష్ట్రంలోని నేతన్నలు లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాశారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని చేనేతపైన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.నేతన్నలు, తమ వెంట తీసుకొచ్చిన లక్షలాది ఉత్తరాలను ప్రధానమంత్రికి పోస్ట్ చేశారు.