Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన
- 18,19 తేదీల్లో వెబ్ఆప్షన్ల నమోదు
- 22న సీట్ల కేటాయింపు
- 28 నుంచి తరగతులు ప్రారంభం
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. బుధవారం నుంచి లాసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన లాసెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల రెండు నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌తోపాటు ధ్రువపత్రాల పరిశీలన కోసం ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ ఉంటుందని వివరించారు. 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ (సీఏపీ, ఎన్సీసీ) అభ్యర్థులకు హైదరాబాద్‌లో భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. 17న అర్హులైన అభ్యర్థుల వివరాలను పొందుపరుస్తామనీ, ఏమైనా సవరణలుంటే ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 18, 19 తేదీల్లో అభ్యర్థులు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వివరించారు. 20న ఆప్షన్లను మార్పు చేయొచ్చని సూచించారు. 22న తొలివిడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో చేరాలని కోరారు. ట్యూషన్ ఫీజును చలానా ద్వారా చెల్లించాలని సూచించారు. ఈనెల 28 నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఇతర వివరాల కోసం www.lawcetadm.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. లాసెట్-2022కు 35,538 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 28,921 (82.46 శాతం) మంది రాతపరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. వారిలో 21,662 (74 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.