Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం కోసం రాహుల్‌తో నడుద్దాం
- గడపదాటి రండి : ప్రజలకు రేవంత్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'దేశం కోసం రాహుల్‌తో కలిసి నడుద్దాం...గడపదాటి రండి' అంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. ఈమేరకు సోమవారం తెలంగాణ సమాజానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అప్రతిహతంగా సాగిపోతున్న 'భారత్ జోడో యాత్ర' మంగళవారం హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నదని తెలిపారు. చార్మినార్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారం భమై... సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్లో బహిరంగ సభకు చేరుకుంటుందని తెలిపారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలనీ, ఆయనతో కలిసి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్లుగా దేశం నిర్భందంలో ఉందని తెలిపారు 'భావస్వేచ్ఛే కాదు...బతికే స్వేచ్ఛ కూడా కరువైంది' అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారంటూ...తప్పులు ఎత్తి చూపడాన్ని నేరంగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారిది విభజించి పాలించిన సిద్ధాంతమనీ, బీజేపీ పాలనలో మళ్లీ పురుడు పోసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమైందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగాల్లేక 22 కోట్ల యువశక్తి నిర్వీర్యమైపోతున్నదని మండిపడ్డారు. చమురు ధరలు చుక్కలనంటాయనీ, నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయని గుర్తు చేశారు. ఆకలి సూచిలో మన దేశం 107వ స్థానానికి ఎగబాకిందని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో టీఆర్ఎస్ సర్కారు అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతున్నదని ఆరోపించారు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ బానిస సంకెళ్లను తెంచేస్తూ అందర్నీ ఏకం చేస్తూ 'భారత్ జోడోయాత్ర' కొనసాగుతున్నదని తెలి పారు. అందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.