Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదురుతున్న మాటల వివాదం
- టీఎన్జీవో కార్యాలయంపై కమలం దాడి
- ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయన్న బండి సంజయ్
- ఇలాంటివి సహించేది లేదు : రాజేందర్
- టీఆర్ఎస్కు మద్దతివ్వడంపై ఈసీకి ఫిర్యాదు
- బండి సంజయ్ వ్యాఖ్యలకు టీఎస్‌యూటీఎఫ్ ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఎన్జీవో, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోమవారం టీఎన్జీవో, టీజీవో నాయకులు హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మంగళవారం టీఎన్జీవో కేంద్ర కార్యాలయంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఓ రాజకీయ పార్టీకి ఎలా మద్దతిస్తారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఫిర్యాదు చేశారు. ఇలా రోజుకో పరిణామంతో టీఎన్జీవో, బీజేపీ మధ్య వివాదం ముదురుతున్నది. ఓయూ నిరుద్యోగ జేఏసీ ముసుగులో బీజేపీ మూకలు మంగళవారం టీఎన్జీవో కేంద్రం కార్యాలయంపై దాడికి దిగాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లోకి చొచ్చుకొచ్చిన కొందరు ఆగంతకులు, కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ద్వంసం చేయడంతోపాటు ఆ సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నేమ్‌ప్లేట్‌ను పగులగొట్టారు. అకస్మాత్తుగా దూసుకొచ్చి దాడికి దిగడంతో ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న మహిళా ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ వారు తలో చోట దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దాడికి పాల్పడ్డవారిలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరుడు సురేష్‌యాదవ్ ఉన్నట్లుగా ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఓయూ నిరుద్యోగ జేఏసీ పేరుతో సురేష్‌యాదవ్ బీజేపీ నేతల వెంట తిరుగుతున్నారనీ, ఇది ఆ పార్టీ పక్కా ప్రణాళికలో భాగంగానే జరిగిందంటూ ఆరోపించారు. ఈ దాడిని టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్తోపాటు, మాజీ అధ్యక్షుడు జి దేవిప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. టీఎన్జీవోలు అత్యంత పవిత్రంగా భావించే కార్యాలయంపై దాడిచేయడమంటే తెలంగాణ ప్రజలు, ఉద్యోగుల మీద దాడిచేయడమేనని విమర్శించారు.
దాడి చేసిన వారిని క్షమించిన టీఎన్జీవో నేతలు
దాడికి పాల్పడ్డ వ్యక్తులపై టీఎన్జీవో నేతలు మానవత్వం ప్రదర్శించారు. వారి కార్యాలయం మీద దాడికి పాల్పడ్డ వారిని విశాల హృదయంతో క్షమించి వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదుచేయాలంటూ సహచర ఉద్యోగ సంఘాల నేతలు ఒత్తిడి తెచ్చినా ఈ దాడిచేసింది ఓయూకు చెందిన వారు కావడంతో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వారిపై కేసుల నమోదైతే ఉద్యోగావకాశాలను కోల్పోయే ప్రమాదం ఉండడంతో పెద్దమనసుతో క్షమించి పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసే ఆలోచనను ఉపసంహరించుకున్నారు. కేసు నమోదుచేసే విషయంపై పోలీసులు టీఎన్జీవో నేతలను సంప్రదించినా దాడికి పాల్పడిన వారిని వదిలేయాలంటూ, కేసు నమోదు చేయొద్దంటూ సూచించారు.
దాడులకు పాల్పడటం తగదు : రాజేందర్, ప్రతాప్
టీఎన్జీవో భవన్ అంటే ఉద్యమాలకు వేదిక అని ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ అన్నారు. సీఎం కేసీఆర్ నుంచి మొదలుకుంటే బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీల నేతలెందరో ఈ వేదిక నుంచే తెలంగాణ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారని గుర్తు చేశారు. ఇది సమస్యలు పరిష్క రించే క్షేత్రమన్నారు. బీజేపీ పుట్టనప్పుడే తెలంగాణ పేరుతో టీఎన్జీవో పుట్టి రెండు లక్షల సభ్యులతో 75 ఏండ్లుగా కొనసాగుతున్నదని తెలిపారు. అంత చరిత్ర ఉన్న టీఎన్జీవో కార్యాలయం మీద దాడిచేయడం అత్యంత దారుణమని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనో భావాలను గౌరవించకుండా, ఉద్యోగులను అభిప్రాయాలు తెలుసుకోకుండా దాడులు చేయడం ఎలాంటి సంప్రదాయమని ప్రశ్నించారు. తమ మీద ఆరోపణలు చేయడమే కాకుండా దాడులకు పాల్పడటం తగదని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలు, ఉద్యోగుల మనుసులు గెలవాలే తప్ప ఇలా దాడులు చేయడం సరైంది కాదని సూచించారు. ఉద్యమాల్లో రాటుదేలిన టీఎన్జీవో కార్యాలయంపై దాడులు చేయడమంటే తెలంగాణ ప్రజలు, ఉద్యోగులపై దాడి చేసినట్టు అవుతుందని వివరించారు.
ఉద్యమకారుల మీద దాడిచేయడమే : జి దేవిప్రసాదరావు
టీఎన్జీవో భవన్‌పై బీజేపీ కార్యకర్తలు దాడిచేయడాన్ని ఆ సంఘం మాజీ అధ్యక్షుడు జి దేవీప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. మునుగోడులో ఓడిపోతున్నామని తెలిసి ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదని సూచించారు. చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి టీఎన్జీవో భవన్‌పై దాడిచేశారనీ, ఇది తెలంగాణ ఉద్యమకారులమీద దాడిచేయడమేనని అన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు చేస్తే ఉద్యోగులు ప్రతిఘటిస్తారనే విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
బీజేపీ విధానాలపై బండి సంజరు పోరాడాలి : టీఎస్‌యూటీఎఫ్
ఉద్యోగ, ఉపాధ్యాయులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి పదోన్నతులు, బదిలీలకోసం పైరవీలు చేసుకుంటారంటూ అవమానకరంగా మాట్లాడటం సరైంది కాదని తెలిపారు. ఇలా నోరు పారేసుకునే బదులు వారి సమస్యల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడితే బాగుంటుందని హితవు పలికారు. కేంద్రంతో మాట్లాడి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) రద్దుకు ఆయన కృషి చేయాలని కోరారు. ఎన్ఈపీతోపాటు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 17,18 తేదీల్లో రాష్ట్రంలో వాహన జాతాలు నిర్వహిస్తామని వివరించారు.
ఇది హాస్యాస్పదం : టీఎస్పీటీఏ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చెప్పులు మోసుకుంటూ ఊడిగం చేసే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్ అలీ విమర్శించారు.