Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోనే 35 నుంచి 40 వేల మంది ఓటర్లు
- తరలించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు
- ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ
- ఎల్బీ నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలపై ఫోకస్
- గెలుపోటముల్లో వారిదే కీలకపాత్ర
అచ్చిన ప్రశాంత్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించడంపై పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టిన ఓటర్లను సొంతూరుకు రప్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. నియోజకవర్గంలోని 2.41 లక్షల ఓట్లలో 20 శాతానికిపైగా ఇతర ప్రాంతాల్లో ఉండటం ఆయా పార్టీలను కలవరపాటుకు గురిచేస్తున్నది. ఏ ఊరిలో చూసినా వందల మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రాణసంకటంగా మారిన ఈ ఉప ఎన్నిక గెలుపోటముల్లో ఈ ఓట్లే కీలకం కాబోతున్నాయి. దీంతో ఆయా ఓటర్లను రప్పించటం, తమకు ఓటేయించుకోవడం కోసం ఫోకస్‌పెట్టి పనిచేస్తున్నాయి. ఆ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను కేటాయించాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, తాయిలాల ఆశ చూపుతూ తాము ఏర్పాటు చేసిన వాహనాల్లో తరలించి లబ్ది పొందేందుకు వారం రోజుల నుంచే ఒక ఎత్తుగడతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో ఉపాధి కోసం వలసొచ్చిన మునుగోడు ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయంపై జల్లెడపట్టి ఆరాతీస్తున్నారు. ఓటర్ల అడ్రస్‌లు పట్టుకుని మరీ వారుండే చోటుకెళ్లి తమ పార్టీకే ఆ ఓట్లు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటిదాకా నగర శివార్లలోని ఫంక్షన్‌హాళ్లలో గ్రామాల వారీగా, పార్టీల వారీగా ఆత్మీయసమ్మేళనాలను ఆయా పార్టీలు నిర్వహించాయి. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటిగా సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఓటర్లు కూడా ఏ పార్టీవాళ్లనూ నొప్పించకా..తాము నొవ్వకా అన్నింటికీ హాజరయ్యారు. దీంతో ఏ ఓటు ఎటు పడుతుందో? ఎవరి కొంప ముంచుతుందో? అనేది అర్థం కాకుండా పోతున్నది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ ఇలా ఏ పార్టీకా ఆ పార్టీ వాళ్లను వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని పెట్టుకుని మరీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఓట్లను రాబట్టుకునేందుకు, తాయిలాలిచ్చి తమవైపునకు తిప్పుకునే బాధ్యతను బీజేపీ ఆయా నియోజకవర్గాల్లోని కార్పోరేటర్లకు అప్పగించింది. ఈ పనిని ఓవరాల్‌గా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, జిట్టా బాలకృష్ణారెడ్డి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలైన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. టీఆర్ఎస్- సీపీఐ(ఎం)-సీపీఐ నుంచి సమన్వయ కమిటీ వేసుకుని మరీ ఓట్లపై దృష్టి సారించారు.
మునుగోడు మండలంలోని 13 ఎంపీటీసీల పరిధిలో ఆరువేల మందికిపైగా ఓటర్లు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరంతా జీవనోపాధి కోసం వలసెల్లినవారే. గట్టుప్పల మండలంలో 14 వేల ఓట్లు ఉంటే అందులో నాలుగు వేల దాకా హైదరాబాద్‌లో ఉన్నాయి. తేరట్పల్లి గ్రామంలో 2,300 ఓటర్లుంటే అందులో 587 మంది ఉపాధి నిమిత్తం ఎల్బీనగర్, ఉప్పల్ నియోజక వర్గాల పరిధిలో ఉంటున్నారు. అదే మండలంలోని శేరిగూడం, ఖమ్మ గూడెం గ్రామాలకు చెందిన 60 నుంచి 70 శాతం ఓట్లు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉండటం గమనార్హం. ఇలా ఆ మండలంలో ఏ ఊరులో చూసినా 20 శాతం నుంచి 30 శాతం వరకు హైదరాబాద్‌లోనే ఉన్నారు.