Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ప్రచారం
- అనధికారికంగా మొదలైన డబ్బు, మద్యం పంపకం !
- భారీగా పోలీసులు మోహరింపు
- పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-మిర్యాలగూడ
నెలరోజులుగా మునుగోడు నియోజకవర్గంలో హోరెత్తిన ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. మైకులు, సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్ కావడంతో నియోజకవర్గం గప్ చుప్‌గా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున స్థానికేతరులు పెద్ద ఎత్తున తరలివచ్చి విస్తృత ప్రచారం చేశారు. ప్రచారం ముగియడంతో మంగళ వారం సాయంత్రం స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో నియోజకవర్గంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మాత్రమే పార్టీ కండువాలు, బ్యాడ్జీలు పెట్టుకోకుండా వ్యక్తిగతంగా నేరుగా ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
మొదలైన ఓటుకు నోటు పంపకాలు
ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాన పార్టీలు పంపకాలపై దృష్టి సారించాయి. ఒక పార్టీ ఓటుకు 3000 రూపాయలు ఇస్తే.. మరో పార్టీ అదనంగా 1000 రూపాయలు కలిపి రూ.4000 చొప్పున పంపకాల మొదలుపెట్టింది. కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఎన్ని ఓట్లు ఉన్నాయి.. అని అడిగి అన్ని ఓట్లకు లెక్కలు వేసి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ బూతుల వారీగా ఓటర్ జాబితా పట్టుకొని తిరుగుతూ డబ్బులు పంచుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఓ పార్టీ 70 శాతం మంది ఓటర్లకు డబ్బులు ఇవ్వగా, మరో పార్టీ 90 శాతం మంది ఓటర్లకు డబ్బులు పంచుతోంది. ఆ ఇరు పార్టీలు పెద్దఎత్తున డబ్బులు పంచుతుండగా ఓ పార్టీ తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకు ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంచేందుకు సిద్ధమయింది. ఆ మేరకు గ్రామాల వారిలో 50 శాతం మంది ఓటర్లకు డబ్బులు ఇచ్చే విధంగా ప్రణాళిక చేసుకొని అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ బాటిల్ మద్యం, కిలో చికెన్ కూడా అందిస్తున్నారు. మహిళలకు చీరలు, గాజులు పంపిణీ చేస్తున్నారు. పాఠశాల విద్యార్థుల బ్యాగుల్లో డబ్బులు పెట్టి వాళ్ల తల్లిదండ్రులకు పంపుతున్నట్టు తెలిసింది. అదే విధంగా స్కూల్ బస్సుల్లో మద్యాన్ని గ్రామాల్లోకి తరలిస్తున్నారని సమాచారం.
అర్థం కాని ఓటర్ నాడి
పోలింగ్‌కు ఒక రోజే సమయం ఉండటంతో ఓటర్ల నాడీ కనిపెట్టేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో గుబులు పెరుగుతోంది. డబ్బులు, మద్యం ఇచ్చినా తమకు ఓటు వేస్తారో లేదో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. గ్రామాల వారీగా తమ పార్టీ ఓటు బ్యాంకును లెక్కలేసు కుంటూ ఇతర పార్టీల ఓట్లు తమకు ఎన్ని వస్తాయో అని బేరీజు వేసుకుంటున్నారు. మధ్యతరగతి ఆపై స్థాయి కుటుంబాలకు చెందిన కొందరి నుంచి మద్దతు విషయంలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో పార్టీ నాయకుల్లో గుబులు నెలకొంది. ఎన్నికల్లో తటస్థ ఓటర్లతోపాటు యువకులు కీలకంగా మారనున్నారు.
భారీగా పోలీసుల మోహరింపు
ఈ నెల 3న జరిగే ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ నియోజకవర్గంలో భారీగా పోలీసులను దింపింది. నియోజవర్గంలో 2,41,855 మంది ఓటర్లుకుగాను 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 35 పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 10 కేంద్రాలను సమస్యాత్మక మైనవిగా గుర్తించారు. దీనికిగాను 3,366 మంది పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరింపజేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపట్టారు. జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
బరిలో 47 మంది అభ్యర్థులు
ఈనెల 3న జరగనున్న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరింపజేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేపడుతున్నారు.
298 పోలింగ్ కేంద్రాలు..
నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 105 సమ స్యాత్మకమైనవిగా గుర్తించారు. 35 పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో నలుగురు సిబ్బంది చొప్పున నియమించారు. 2,41,855 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనున్నారు. పోలింగ్ ప్రశాం తంగా జరిగేందుకు 3,366 మంది పోలీసులను నియమించారు. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 80ఏండ్లు దాటిన ఓటర్లు 2,626 మంది ఉన్నారు. 5,686 పోస్టల్ బ్యాలెట్ ఉండగా, 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.