Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కుట్రలను తిప్పికొడతారు
- టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతును ప్రజలు ఆమోదిస్తున్నారు
- సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ పోరుబాటు తప్పదు
- ప్రభుత్వాలను కూల్చేందుకే ఎమ్మెల్యేల కొనుగోళ్లు
- రాజ్యాంగ పరిధి దాటుతున్న కేరళ గవర్నర్
- కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
బీజేపీ అధిష్టానం కుట్రలో భాగంగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఆ పార్టీని ఓడిస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర తమ్మినేని వీరభద్రం చెప్పారు. తద్వారా అక్కడి పోరాట వారసత్వాన్ని వారు కొనసాగిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని అక్కడి ప్రజలు ఆమోదిస్తున్నారని చెప్పారు. ఓటమి ఖాయమనే భావనతోనే కమ్యూనిస్టులపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ పోరుబాట తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ పరిధి దాటి కేరళ గవర్నర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. బీజేపీని ఓడించే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలనీ, కారు గుర్తుకు ఓటేయాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులెలా ఉన్నాయి?
రాష్ట్ర రాజకీయాలు మునుగోడు ఉప ఎన్నికలపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్తున్నది అబద్ధం. ఇది బీజేపీ అధిష్టానం కుట్ర. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పోటీ బీజేపీయేనని చెప్పేందుకు ఆ పార్టీ తహతహలాడుతున్నది. అధికార టీఆర్ఎస్ దాన్ని దీటుగా ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో మేం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన బీజేపీని ఎదగనీయకూడదనే టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాం. బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించడంపైన్నే వామపక్షాలు దృష్టిపెట్టి పనిచేస్తున్నాయి.
వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు ఎలా ఉందంటారు? సీపీఐ(ఎం) కార్యకర్తలు ఆయన గెలుపు కోసం సహకరిస్తున్నారా?
ప్రజల నుంచి స్పందన బాగుంది. వామపక్షాలు, టీఆర్ఎస్ కలయికను వారు ఆమోదిస్తున్నారు. క్షేత్రస్థాయి సమావేశాల్లోనూ నేను పాల్గొన్నాను. మతోన్మాద పార్టీ బీజేపీ గెలవొద్దన్న అభిప్రాయం ఉన్నది. బీజేపీ మతోన్మాద విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకున్నారు. అందుకే టీఆర్ఎస్ గెలుపు కోసం సహకరిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి కుంటిసాకులు చెప్పి బీజేపీలో చేరారు. అయితే 'రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారంటూ ప్రజలంటున్నారు. నాకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులే దక్కాయి.'అని రాజగోపాల్‌రెడ్డి అంగీకరించారు. ఆ నియోజకవర్గంలో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు రెడ్డి అని ప్రజల్లో బలమైన ముద్ర ఉన్నది. ఇది మా ఐక్యతను బలోపేతం చేస్తున్నది.
ఈ ఎన్నికల ముందు వరకు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు? ఫలితాల తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
ఈ ఉప ఎన్నికల ముందు వరకు పోడు భూమి, భూనిర్వాసితుల సమస్యల, కార్మికులకు కనీస వేతనాలు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించాం. 20 అంశాలపై సీఎం కేసీఆర్ మెమోరాండం సమర్పించాం. పోడు భూములకు పట్టాలిస్తామన్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతున్నది. ఇంకా కొన్నింటిపై సానుకూలంగా స్పందించారు. వాటిని పరిష్కరించాలని మళ్లీ కోరతాం. స్పందించకపోతే మళ్లీ పోరుబాట పడతాం. దబ్బనం పార్టీ, సూదుల పార్టీ అన్న కేసీఆర్‌కు ఎలా మద్దతిస్తారంటూ బీజేపీ నాయకులంటున్నారు. బీజేపీ మతోన్మాద ప్రమాదం ముంచుకొచ్చింది కాబట్టే టీఆర్ఎస్కు మేం మద్దతు ప్రకటించాం. బీజేపీ దుర్మార్గాలను ఓడించడం కోసమే టీఆర్ఎస్తో కలిశాం. ఆ పార్టీకి మద్దతిచ్చినంత మాత్రాన పోరాడే హక్కును వదులుకున్నట్టు కాదు.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ వామపక్షాలతో కలిసే పనిచేస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారు. మీరు వైఖరి ఎలా ఉంది?
గతంలో, సీపీఐ(ఎం) ప్రతినిధులు కలిసినపుడు, గతనెల 30న నిర్వహించిన చండూరు బహిరంగసభలోనూ రాబోయే ఎన్నికల్లోనూ వామపక్షాలతో కలిసే పనిచేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అఖిల భారత స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి పనిచేయాలన్నారు. దాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం. ఎన్నికలు వచ్చినపుడు నిర్ణయం తీసుకుంటాం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఎలా చూస్తారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారు కదా?. పార్లీ ఫిరాయింపులపై సీపీఐ(ఎం) అభిప్రాయమేంటీ?
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కేంద్రస్థాయిలో బీజేపీ కుట్ర పన్నిందన్నది ప్రజలందరికీ తెలుసు. డబ్బులను ఎర చూపిందనడంలో సందేహం లేదు. ఇది నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమే కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే తంతు జరగింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వాలనే కూల్చే కుట్ర బీజేపీ చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదంగా మారింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్, చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్ హయాంలోనూ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునే ధోరణి ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ మాత్రం ఎమ్మెల్యేల కొనుగోళ్ల వరకే కాకుండా ప్రభుత్వాలను కూల్చే స్థాయికి ఈ వ్యవహారాన్ని తెచ్చింది. ఎమ్మెల్యేలు డబ్బులు, ప్రలోభాలకు లొంగకపోతే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నది.
కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అక్కడి గవర్నర్ తీరును ఎలా అర్థం చేసుకోవాలి?
కేరళలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. వీసీలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అయితే ఒక వీసీ నియామకానికి సంబంధించి కేరళ హైకోర్టు తప్పుపట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని మిగిలిన తొమ్మిది మంది వీసీలను తొలగించాలంటూ గవర్నర్ అహంకారంతో నోరుపారేసుకున్నారు. ఆయన రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు చాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆ దిశగా కేరళ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇంకోవైపు గవర్నర్ వ్యవస్థ ఉండొద్దన్నది మా అభిప్రాయం.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. మీ అంచనా ఏంటీ?
సుదీర్ఘమైన యాత్ర రాహుల్‌గాంధీ చేస్తున్నారు. ఎవరైనా ప్రజలకు మధ్య వెళ్లి సమస్యలను తెలుసుకోవడం మంచి విషయం. దాన్ని అభినందించాలి. దక్షిణాదిలో ఆ యాత్రకు కొంత స్పందన వస్తున్నది. ఉత్తరాదిలో ఎలా ఉంటుందో చూడాలి. బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ, సైద్ధాంతిక పునాది అవసరం. హిందూత్వ సిద్ధాంతం, మనుధర్మం, చాతుర్వర్ణ వ్యవస్థ, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం వంటి అంశాలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపాలి. లౌకికత్వ పునాదిపై వాటిని ఎదుర్కొనేలా కాంగ్రెస్ విధానాలుండాలి. కాంగ్రెస్‌లో గ్రూపులు, సంస్థాగత సమస్యలున్నాయి. చాతుర్వర్ణం స్థానంలో లౌకికత్వ పునాదిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. త్వరలోనే గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ యాత్ర అక్కడికి వెళ్లడం లేదు. రాహుల్‌గాంధీ యాత్రలో ఇలాంటి లోపాలున్నాయి.
రాజ్యాంగం, రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న మోడీ విధానాలపై పోరాడకుండా బీజేపీని సీఎం కేసీఆర్ నిలువరించగలరా?
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నదో గమనించాలి. దాన్ని సీఎం కేసీఆర్ సమగ్రంగా ఎదుర్కోవాలి. బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా చేయడంపై కాకుండా రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడంపైనే ఆయన ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టారు. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ లౌకిక సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసుకోవాలి. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం ఈ నాలుగు మూలస్తంభాలే ప్రాతిపదికగా రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుతున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడాలి. భవిష్యత్తులో కేసీఆర్ అలా చేస్తారని ఆశిద్దాం
ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు ప్రజలకు మీరిచ్చే సందేశమేంటీ?
మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్కడి ప్రజలకు తెలంగాణ పోరాట సంప్రదాయాలున్న గడ్డ. నల్లగొండ ఎర్రజెండాకు పుట్టినిల్లు. సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గతనెల 30న చండూరు సభలో సహజమైన ఐక్యత ఆ మూడు పార్టీల మధ్య కనిపించింది. టీఆర్ఎస్ జెండాను కప్పుకుని వచ్చినా వారి తండ్రి లేదా తాత ఎర్రజెండాను పట్టినవారే. వారి కుటుంబ వారసత్వమంతా ఎర్రజెండాతో అనుబంధమున్నది. ఈ పోరాట వారసత్వాన్ని నిలబెట్టాల్సిన మునుగోడు ప్రజలపై ఉన్నది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా గాంధీని హత్య చేసిన గాడ్సే వారసుల పార్టీ బీజేపీ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లిం మధ్య జరిగిన పోరాటంగా చరిత్రను వక్రీకరించింది బీజేపీ. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రావణకాష్టం రగిలిస్తున్న పార్టీ బీజేపీ. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్న ఊసరవెల్లిలా ఉన్న బండి సంజరులాంటి నాయకుల కుట్రలను తిప్పికొట్టాలి. బీజేపీని ఓడించే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలి.