Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై కాలకేయుల్లా బీజేపీ నేతలు దండయాత్ర చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి లబ్ది కోసం, బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసమేనని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో అర్థాంతరంగా ఈ ఎన్నికను తెచ్చిందని తెలిపారు. సిద్ధాంతాలు వల్లిస్తూ, ఎవరూ పాటించని రాజకీయ నీతులను పాటిస్తున్నట్టు కమలం పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డికి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు ఎరవేసి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేయించి ఈ ఉపఎన్నికను తీసుకొచ్చారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు నమ్మని విషయాలనే నమ్మిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల కోసం రాజగోపాల్‌రెడ్డిని రిహార్సల్‌గా ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నదని వివరించారు. మతవిద్వేషాలే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న ఆపార్టీ ప్రజలను, ఇతర పార్టీలను చీల్చడంలో ఎంతకైనా తెగించి నిస్సిగ్గుగా రూ.కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా కూలుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలను మార్చడం దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని పేర్కొన్నారు. ఇంతకాలం మునుగోడు అభివృద్ధిని పట్టించుకోకుండా ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచి సాధించేది ఏమీ ఉండబోదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ సంక్షేమ పథకాలకు కోత విధిస్తున్నదని వివరించారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను హోల్‌సేల్‌గా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నదని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చ గొడుతూ నిరంకుశ పాలన సాగిస్తున్నదనీ, ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి బీజేపీ బలపడకుండా మునుగోడు ఎన్నికల్లో తరిమికొట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గురువారం జరిగే పోలింగ్‌లో సీపీఐ, సీపీఐ(ఎం) బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించడానికి మునుగోడు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.