Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో జాతీయ సదస్సు : వ్యకాస ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల పరిరక్షణ కొసం ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ అధ్యక్షతన కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితులపై పెరుగుతున్న హింసకు నిరసనగా సామాజిక సంఘాలన్నింటితో ఐక్య ప్రతిఘటన పోరాటాలు నిర్వహించేందుకు ఈ నెల ఐదున న్యూ ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 300రేట్లు దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఉపాధి వనరుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గించట్టాన్ని చూస్తే..దాన్ని నీరుగార్చే కుట్ర దాగుందని విమర్శించారు. నీతి ఆయోగ్ సాకుతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్ అమలు చేయకుండా దేశంలో20శాతంగా ఉన్న దళితులకు బీజేపీ ద్రోహం చేసిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకించి యూపీలో దళితులు అభద్రతలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పోరేట్ శక్తులకు అమ్ముతూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్లు లేకుండా చేసి సామాజిక న్యాయానికి సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నదని వివరించారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, ములకలపల్లి రాములు, పి వెంకటయ్య నర్సింహులు జగన్ ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.