Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా సోమ్ము నొక్కేసిన ముఠాను పట్టుకున్న పోలీసులు
- బాధిత కుటుంబాల నుంచి ఆధారాల సేకరణ: వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
నకిలీ చాలన్లతో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పథకాల్లోని కార్మికుల బీమా సొమ్మును స్వాహా చేసేందుకు పథక రచన చేసిన ఏడుగురు ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్ వర్ధన్నపేట, శాయంపేట, రాయపర్తి, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. వారి నుంచి డెత్ క్లయిమ్ జిరాక్స్ దరఖాస్తులు, సీపీయూ, మానిటర్, కలర్ ప్రింటర్, ఒక సెల్‌ఫోన్, పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడికి చెందిన భూమిహర్ భాస్కర్, పరకాల ఎస్సీ కాలనీకి చెందిన బొచ్చు బిక్షపతి, ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన అర్షం కమారస్వామి అలియాస్ పెద్దబాబు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండాకు చెందిన మాలోత్ నెహ్రు, మాలోత్ వీరస్వామి, మాలోత్ రవి, మాలోత్ శ్రీనుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో పేరు నమోదు చేసుకుంటే వారు మరణించినప్పుడు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. దీనికి ముందుగా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, పరకాల సహాయక కార్మిక అధికారి క్షేత్ర స్థాయిలో విచారణ జరపకుండా తన అల్లుడైన భూమిహర్ భాస్కర్‌తో అనధికారకంగా విచారణ జరిపించేది. దీన్ని అదునుగా భావించిన భాస్కర్ ప్రభుత్వసొమ్మును కాజేసేందుకు పథకం రూపొందించాడు. ఇందుకు మిగితా నిందితులను వర్ధన్నపేట, రాయపర్తి, శాయంపేట, ఆత్మకూర్ ప్రాంతాల్లో ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వీరంతా కార్మిక శాఖలో సభ్యత్వం లేని వ్యక్తులు ఏవరైనా ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా గాని లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమాచారాన్ని సేకరించేవారు. వారికి కార్మికశాఖ నుంచి బీమా ఇప్పిస్తామని నమ్మించి బాధితులతో ఒప్పందం చేసుకునేవారు. ఆయా కుటుంబాల నుంచి మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలను తీసుకోవడంతో పాటు రూ.10వేలు వసూలు చేసేవారు. ఇలా సేకరించిన పత్రాలతో ప్రధాన నిందితుడైన భాస్కర్.. గతంలో కార్మిక శాఖ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు కోసం కార్మికులు మీసేవలో చెల్లించిన రుసుము సంబంధించి రశీదులను సేకరించేవాడు. రశీదులోని తేది స్థానంలో పాత తేదీలతో మీ సేవలో రుసుము చెల్లించినట్టు నకిలీ రశీదు రూపొందించి మరణించిన వ్యక్తి ప్రస్తుతం జీవించి ఉన్నట్టు కార్మికశాఖలో దరఖాస్తు చేసి కార్మిక కార్డును పొందేవారు. వాటి సాయంతో మరణించిన వ్యక్తి పేరుతో బీమాకు కార్మిక శాఖలో దరఖాస్తు చేసేవారు. ఇదే తరహాలో ఈ ముఠా కార్మిక శాఖలో 29 దరఖాస్తులను అందజేసినట్టు సమాచారం. ముఠా కార్యకలపాలపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నట్టు సీపీ తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తామని చెప్పి డబ్బులు వసూళ్ళకు పాల్పడుతున్న వ్యక్తులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి వారి సమాచారం ఉంటే వరంగల్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257కు సమాచారం అందించాలని తెలిపారు. కేసు చేధించండంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐ లవణ్ కుమార్, వర్ధన్నపేట, శాయంపేట, రాయపర్తి, ఆత్మకూరు ఎస్ఐలు రామారావు, రాజు, సుమన్, వీరభద్రయ్య, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్లు నాగరాజు, సృజన్, సురేష్, నవీన్, శ్యాం, శ్రీనును అభినందించారు.