Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి ప్రసన్నం కోసం ఎత్తులకు పైఎత్తులు
- ప్రతి 100 ఓట్లకు ముగ్గురు, నలుగురు ఇన్చార్జీలు
- మునుగోడు బైపోల్స్‌లో ఔటర్స్ ఔట్...
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల సలహాలు...బీజేపీలో ఆర్ఎస్ఎస్ శ్రేణుల ఆదేశాల మేరకు ఇప్పటిదాకా గ్రామాల్లో రాజకీయాలు నడిచాయి. ప్రచార గడువు ముగియడం, వేరే నియోజకవర్గాల వాళ్లు ఇక్కడ ఉండొద్దనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇన్నిరోజులు గ్రామాల్లో తిష్ట వేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తిరిగి తమ ఇండ్లబాట పట్టారు. లాడ్జీలు, హౌటళ్లల్లో పోలీసులు వేరే వాళ్లు ఎవ్వరూ ఉండకుండా తనిఖీలు చేపట్టారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించి మరీ పంపించేశారు. దీంతో మునుగోడు నియోజకవర్గ గ్రామ రాజకీయాలు ఇక పూర్తిస్థాయిలో సొంతూరు నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోలింగ్‌కు ఒకే రోజు గడువు ఉండటంలో ఓటర్లను పోలింగ్ బూత్‌కు ఎలా తరలించాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు విడివిడిగా, అవసరమైన చోటకు ఇద్దరు ముగ్గురు నాయకులు కలిసి వెళ్తున్నారు. ఆ ఓట్లు తమ పార్టీకే పడేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరు చెబితే ఆ ఓటు పడుతుందనుకుంటే వారినే నేరుగా ఆ ఇంటికి పంపుతున్నారు. తమ పార్టీతో గతంలో సానుకూలంగా ఉండి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లినవారి ఓటునూ విడిచిపెట్టుకునేందుకు క్షేత్రస్థాయి నాయకులు సిద్ధంగా లేరు. ఆ ఓటరు ఎవరు చెబితే వింటారు? పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? తమ పార్టీలో ఎవరితో అతనికి విభేదాలున్నాయి? వారికి ఎలా నచ్చజెప్పాలి? కుల పెద్ద చెబితే ఆ ఓటు దక్కుతుందా? ఒకవేళ తాయిలాలు ఇస్తే పడే అవకాశం ఉందా? చిన్నచిన్న సమస్యలు పరిష్కరిస్తే పొందొచ్చా? మద్యం ద్వారా ప్రలోభ పెట్టుకునే వీలుందా? ఇలా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఓటరు మనస్సు గెలిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 'రేపు పొద్దుగాల ఆపదొచ్చినా.. సాపతొచ్చినా..పంచాయతీ వచ్చిపడ్డా అక్కరకొచ్చేది మేమే. కష్టమొచ్చినప్పుడు పలుకరించి అరుసుకునేటోళ్లం మేమే. మావైపు నుంచి ఏమైనా తప్పిదాలు జరిగితే మనస్సులో పెట్టుకోకురి. ఈ ఒక్కసారి మా ముఖం చూసి ఓటేయండి' అంటూ ప్రాధేయపడుతున్నారు.
వంద ఓట్లకూ ఇద్దరు, ముగ్గురు ఇన్చార్జీలు
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రతి ఓటర్‌నూ పోలింగ్‌బూత్‌కు తరలించేందుకు తమతమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను చాలెంజ్‌గా తీసుకుని ముందుకుసాగుతున్నాయి. ప్రతి వంద ఓట్లకు ముగ్గురు, నలుగురు ఇన్చార్జీలను కేటాయించాయి. ఆ ఓటర్ను బూత్‌కు తరలించే బాధ్యతను ఆయా పార్టీలు వారికే అప్పగించాయి. తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను పక్కపార్టీల వాళ్లు వాహనాలపై తీసుకెళ్లనీయకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తామనే సమయాన్ని సైతం వారే చెబుతున్నారు. అప్పటిదాకా వేరే వాళ్లతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లొద్దని వేడుకుంటున్నారు. వయస్సు మళ్లిన వాళ్లను, మహిళలను పోలింగ్ కేంద్రం వద్ద టూవీలర్లు, ఆటోల ద్వారా తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నారు. ఒకరికి అందకుండా మరొకరు వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాయిలాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా లోలోన తమ పని కానిచ్చేస్తున్నారు. ఆ పోలింగ్ బూత్‌లోని ఓటర్లపై పూర్తిగా అవగాహన ఉన్న, అందరితోనూ ముఖపరిచయం వ్యక్తులను, పోలింగ్ నిర్వహణపై పట్టున్న వ్యక్తులను ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. దొంగ ఓట్లు వేయకుండా అరికట్టడంలో వీరిదే కీలకపాత్ర కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.