Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ అహంకారం, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ మదం వల్లే ఉపఎన్నిక
- సామాన్యుల బతుకులను తొక్కిపెట్టారు : రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - సంస్థాన్ నారాయణపురం/మునుగోడు
మునుగోడు ఉపఎన్నిక రెండు భావజాల పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికన్టి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మోడీ అహంకారం, రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్ మదం వల్లే ఈ ఎన్నిక వచ్చిందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రాల్లో సీపీఐ(ఎం), సీపీఐ నాయకులతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. ఎక్కడైనా ఎమ్మెల్యే చనిపోతేనే మరేదైనా ముఖ్యమైన కారణంతో ఉప ఎన్నికలు వస్తాయని.. ఇక్కడ మాత్రం అమ్ముడుపోతే వచ్చాయని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్లకు మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడని విమర్శించారు. నియోజకవర్గానికి ఏమీ చేయకున్నా తన దగ్గర ఉన్న వేలకోట్లు వెదజల్లి గెలుస్తాననే అహంకారంతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారన్నారు. సామాన్యుల బతుకులను తొక్కిపెట్టి కార్పొరేట్ అధిపతులను మోడీ కడుపులో పెట్టుకున్నారని విమర్శించారు.
ప్రజా పథకాలను రద్దు చేస్తున్న బీజేపీని ఓడించండి: సీపీఐ(ఎం)కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్లను గెలిపించాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మతోన్మాద, ప్రమాదకరమైన బీజేపీలో చేరినందుకు ఓడించి తీరాల్సిందేనన్నారు.
రాజగోపాల్ రెడ్డి ప్రయోజనం కోసం ఉపఎన్నిక :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
మునుగోడు నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి తీసుకొచ్చిన ఎన్నిక ఈ ఉప ఎన్నికని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బీజేపీకి ఓట్లేస్తే.. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మతవిద్వేషాలను రెచ్చగొడుతూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ.. ప్రజాస్వామ్యం అనేది ఉండకుండా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సంతలో సరుకు లాగా వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనేందుకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. మంత్రులు గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జని యాదగిరిరావు, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎండి.జహంగీర్, నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.