Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడేం చేయాలో ఫోన్లో మాట్లాడుకుంటారు
- ఢిల్లీ మిత్రులకు ప్రధాని దోచి పెడుతున్నారు
- డెలివరీ బార్సుగా ఇంజనీరింగ్ విద్యార్థులు
- తుపాన్లు ఎదురైనా భారత్ జోడో యాత్ర ఆగదు : కాంగ్రెస్ బహిరంగ సభలో అగ్రనేత రాహుల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్‌తో డైరెక్టు లైన్ ఉందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఎప్పుడు, ఎక్కడేం చేయాలో ప్రతి రోజు చర్చించుకుంటారనీ, అందుకనుగుణంగా కలిసిమెలిసి పని చేస్తారని ఆరోపించారు. కేసీఆర్ ఫోన్ చేయగానే మోడీ స్పందిస్తారని చెప్పారు. దేశ సంపదను ప్రధాని తన ముగ్గురు మిత్రులకు లక్షల కోట్లు దోచి పెడుతున్నారని విమర్శించారు. రైతులు ఎంత కష్టపడుతున్నా...వారికి లాభం దక్కడం లేదని చెప్పారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదనే విషయాన్ని రైతులు తన దృష్టికి తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఎంబీఏ, ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యనభ్యసించిన యువత నేడు డెలివరీ బార్సుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహి రంగసభలో ఆయన ప్రసంగించారు. ఈనెల 23న తెలంగాణలోని ప్రవేశిం చిన భారత్ జోడో యాత్ర... మంగళ వారం ఉదయం హైదరాబాద్ ఆరాంఘర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి బహుదుర్‌పురా మీదగా చార్మినార్‌కు చేరుకుంది. అక్కడ రాహుల్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆఫ్జ్జల్గంజ్, నాంపల్లి మీదుగా నెక్లెస్‌రోడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ... దేశ సమైక్యత కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నానని చెప్పారు. తుపాన్లు ఎదురైనా యాత్ర ఆగబోదని స్పష్టం చేశారు. 'ఒక అడుగు జన ప్రభంజనమైంది. ఒక అడుగు జన చేతనమైంది. భారత్ జోడో యాత్ర జాతి సమైక్య నినాదమైంది. ఒక్కటిగా కదిలి... వేలు...లక్షలు... కోట్ల భారతీయుల్లో జన వాహినిగా మారింది' అని పేర్కొన్నారు. జాతి సమైక్యత, శాంతి సౌభ్రతృత్వంతో ముందుకు సాగుతున్న వైనాన్ని వివరించారు. దేశంలో 'కాంగ్రెస్ ప్రేమ, భరోసా, దైర్యాన్ని పంచుతుంది. బీజేపీ ద్వేషం, అశాంతి, ఘర్షణలను పెంచుతుంది' అని చెప్పారు. మతతత్వ శక్తులు దేశంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నాయని విమర్శించారు. సమైక్యవాద దేశాన్ని ముక్కల చేస్తున్న బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన ఆవశ్యకత నెలకొన్నాయారు. దేశంలో అత్యంత కాలుష్యం ఢిల్లీలో ఉంటుందనీ, ఇప్పుడు అత్యంత రాజకీయ కాలుష్యం హైదరాబాద్‌లో ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడం లేదనీ, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని చెప్పారు. దేశంలో చిరు వ్యాపారులు దెబ్బతిన్నారనీ, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మోడీ అధికారంలోకి రాక ముందు గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలు ఉండేదనీ, ప్రస్తుతం అది 1100కు చేరుకుందన్నారు. కార్పొరేట్ సంస్థల యాజమానులు లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకోగలుగుతున్నారనీ, చిరువ్యాపారులు మాత్రం బ్యాంకుల నుంచి రుణం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోలు, డిజీల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. హైదరాబాద్‌కు ఐటీ హబ్‌గా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. తమ సామరస్యానికి నిదర్శనమనీ, ఆ కల్చర్ తెలంగాణ డీఎన్ఏలోనే ఉందనీ, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని విమర్శించారు.
2024లో కేంద్రంలో బీజేపీయేతర సర్కారు : మల్లిఖార్జున ఖర్గే
రాహుల్‌గాంధీ నేతృత్వంలో కేంద్రం(2024)లో బీజేపీయేతర ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందంటూ మోడీ ఎప్పుడూ అడుగుతుంటారనీ, ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది తమ పార్టీయేనని గుర్తు చేశారు. దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మార్చిందనీ, దాని ఫలితంగానే మోడీ ప్రధాని అయ్యారని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు గుజరాత్‌కు ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అవకాశముంటే గాలి,ఆక్సిజన్‌పై కూడా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో బీజేపీ సర్కారు ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులకు టీఆర్ఎస్కు మద్దతిచ్చారనీ, మరోవైపు ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, వి హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సీతక్క, షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్, నిరంజన్, రోహిన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.