Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీిఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ గూండాల దాడి
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ జగదీశ్‌కు గాయాలు
- అత్త ఊరిలో ఈటలకు చేదు అనుభవం
నవతెలంగాణ -మునుగోడు
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో మంగళవారం బీజేపీ గూండాలు బరితెగించారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అత్తగారు ఊర్లో చేదు అనుభవం ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి..
ఉపఎన్నిక ప్రచారం మంగళవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నారాయణపురం నుండి మునుగోడు వరకు రోడ్ షో ఉంది. ఈ రోడ్ షోకు మునుగోడు మండలంలోని అన్ని గ్రామాల నుంచి వేలాదిమంది బైక్ ర్యాలీతో మండల కేంద్రానికి తరలివస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా పలివెల గ్రామం సెంటర్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల బైక్ ర్యాలీ వస్తుండగా..బీజేపీ నాయకులు రోడ్డుపై అడ్డుగా ఉన్నారు. పోలీసులు దారి ఇవ్వాలని కోరినప్పటికీ ఇవ్వకుండా ఘర్షణకు దిగి టీఆర్ఎస్ నాయకులపై కట్టెలతో దాడికి దిగడంతో పలివెలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ దాడిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, జెడ్పీచైర్మెన్ జగదీశ్‌తోపాటు టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయాలైన వారికి మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ ఘర్షణలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.