Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2017లో జరగాల్సిన వేతన సవరణేగా...
- ఈసీ అనుమతి ఎందుకు?: టీఎస్ఆర్టీసీ టీజేఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు డిఏలు, ఇతర అలవెన్సులు ఇచ్చేందుకు అవసరం లేని ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుమతి వేతన సవరణకు ఎందుకని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగానే ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అమలు చేస్తే ఎవరు అభ్యంతరపెడతారన్నారు. కాలయాపన, ఆర్టీసీ కార్మికులను మోసం చేయడం కోసమే ప్రభుత్వం ఈసీకి లేఖల పేరుతో నాటకాలు ఆడుతుందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని, ఆ తర్వాత అసెంబ్లీలోను వారి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారనీ, ఇప్పటి వరకు ఆ హామీలకు అతీగతీ లేదన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఐపోయాక... అంటూ మరో డ్రామాకు మంత్రులు, ఆర్టీసీ చైర్మెన్, ప్రభుత్వం తెరలేపాయని విమర్శించారు. సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలు అనుమతించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి జిమ్మిక్కులను కార్మికులు ఎలా నమ్ముతారని అడిగారు. హైదరాబాద్ సిటీలో డిపోల విలీనం పేరుతో సిబ్బందిని కుదిస్తున్నారనీ, ఆర్టీసీ కార్మికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారి సమస్యల్ని పరిష్కరించి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.