Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల్లో అరుదైన జన్యుపరమైన వ్యాధుల మిషన్ ప్రారంభం
- ఐదేండ్లపాటు కొనసాగనున్న పరిశోధనలు
- సీడీఎఫ్ డీలో ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) దేశంలో అరుదైన వ్యాధుల అడ్డుకట్టకు శ్రీకారం చుట్టింది. పిల్లల్లో ఈ రకమైన వ్యాధులకు కారణాలను కనుగొనే కార్యక్రమాన్ని ఐదేండ్ల పాటు కొనసాగించనున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం సీడీఎఫ్‌డీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మిషన్‌కు సంబంధించిన వెబ్ సైట్‌ను, ఆధునాతన కంప్యూటింగ్ సెక్షన్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ రాకేశ్ గోఖలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదొక సంక్లిష్టమైన, ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు.
సీడీఎఫ్‌డీ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది అరుదైన వ్యాధులు కలిగిన చిన్నారులను ఈ మిషన్ కోసం ఎంపిక చేసుకోనున్నట్టు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జన్యువ్యాధులపై పరిశోధనలు చేస్తున్న 15 సంస్థల భాగస్వామ్యంతో ఈ పరిశోధన చేయనున్నట్టు తెలిపారు. ఇతర సంస్థలు ఇప్పటికే ఎంపిక చేసుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినే తీసుకోనున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది అరుదైన వ్యాధులు కలిగిన వారున్నారని చెప్పారు. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో అతి తక్కువ పొడువు కలిగిన వారు జన్మించడం, తమిళనాడులోని కల్లూరులోని ఒక ప్రాంతంలో చర్మవ్యాధులు కలిగిన వారు జన్మిస్తున్నారని వివరించారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అరుదైన వ్యాధితో ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. భారతదేశంలో ప్రతి 20 మంది రోగుల్లో ఒకరు అరుదైన వ్యాధి కలిగిన వారున్నారనీ, వీరిలో 80 శాతం మంది వ్యాధికి జన్యులోపాలే కారణమని తెలిపారు. అరుదైన వ్యాధిగ్రస్తుల్లో 50 శాతం మంది పిల్లులుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో 30 శాతం తమ ఐదో జన్మదినాన్ని జరుపుకోకముందే మరణిస్తున్నారని తెలిపారు. అరుదైన రోగాల్లో 95 శాతం వ్యాధులకు ఇప్పటికీ ఆమోదించిన చికిత్స లేదని వెల్లడించారు. ఏడు వేల రకాల అరుదైన వ్యాధులుంటే అందులో కేవలం 300 రకాలకే థెరపీలు అందుబాటులో ఉన్నాయనీ, మిగిలిన వాటికి చికిత్సను నిర్దారించే ముందు లోపాల జన్యు కారకాలను కనుగొనాల్సిన అవసరముందని వివరించారు. ఒక్కో రోగికి ఏడాదికి సగటున రూ.18 లక్షల నుంచి రూ.1.70 కోట్ల వరకు ఖర్చు వస్తుందనీ, ఈ ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దక్షిణాసియాలో ఉన్న వ్యాధిగ్రస్తుల్లో మూడో వంతు భారతదేశంలో ఉండటం సమస్యను తక్షణం పరిష్కరించాల్సిన అవరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా వ్యాధుల కారణాలను తెలుసుకోవడం పరిశోధన ప్రధాన లక్ష్యమని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో జన్యులోపాల వ్యాధులతో పిల్లలు జన్మించకుండా అడ్డుకట్ట వేయడం, ఆయా వ్యాధులకు థెరపీలు, చికిత్సలను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. చికిత్సలకయ్యే ఖర్చును తగ్గించడం, అరుదైన వ్యాధులు సాధారణ వ్యాధులుగా మారకుండా నిరోధించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ ముఖ్య పరిశోధకులు, డయాగస్టిక్స్ డివిజన్ హెడ్ డాక్టర్ అశ్విన్ బి.దలాల్ తదితరులు పాల్గొన్నారు.