Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గట్టి బందోబస్తు మధ్య మునుగోడు ఎన్నికలను నిర్వహించండి : సీఈసీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో దాడులకు పాల్పడిన బీజేపీ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. గట్టి బందోబస్తు మధ్య ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి ఆయన మంగళ వారం లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి బీజేపీ నాయకులు అనేక గ్రామాల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఓటమి భయంతో వారికి అనుకూలంగా లేని ప్రజలను అసభ్య పదజాలంతో తిట్టడం, ఘర్షణలకు దిగటం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. చౌటుప్పల్ మండలంలో అంకిరెడ్డి గూడెంలో బీజేపీ నాయకులు వారి వాహనాల్లో తెచ్చుకున్న రాళ్లు,కర్రలతో విచక్షణ కోల్పోయి గ్రామస్థులు, వార్తలు సేకరిస్తున్న పాత్రికేయు లపై దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు మండలం పలివెల గ్రామంలోనూ ఇదేతరహా దాడులకు తెగ పడటంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఇతరులు గాయాల పాలైనారని వివ రించారు. ఇదే విధమైన ఘర్షణలకు బీజేపీ నాయకులు పాల్పడితే మునుగోడులో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండే అవకాశముందని తెలిపారు. నిఘావిభాగాలు, కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మునుగోడు ఉపఎన్నిక సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చేనేతపై జీఎస్టీని ఎలా వేస్తారు? : చాడ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జీఎస్టీని ఎలా వేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ఇది శవాల మీద పేళాలు ఏరుకున్నట్టేనని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దేశవ్యాపితంగా చేనేత కార్మికులు పనుల్లేక అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మగ్గంపై నేసే వస్త్రాలకు జీఎస్టీలో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమన్నారు. చేనేత కార్మికులు చేసే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.