Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఓటర్లు ప్రగతికి పట్టం కడతారు
- సీపీఐ (ఎం), సీపీఐ నేతలకు ధన్యవాదాలు : మీడియాతో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓడిపోతామని తెలిసే బీజేపీ నేతలు పలివెలలో దాడులకు పాల్పడ్డారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ శ్రేణులు భౌతిక దాడులకు దిగుతున్నాయని ఆయన విమర్శించారు. అయినా బీజేపీ నేతల కుట్రలు, కుయుక్తులను తట్టుకుని మునుగోడులో తమ పార్టీ కార్యకర్తలు అద్భుతంగా పోరాడారని అభినందించారు. తాము ప్రభుత్వం తరపున చేసిన పనులు చెప్పి.. మునుగోడులో ఓట్లు అడిగామని అన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోవటానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... నీళ్లిచ్చిన పార్టీ (టీఆర్ఎస్)కి.. కన్నీళ్లిచ్చిన పార్టీ (బీజేపీ)కి మధ్య తేడాను మునుగోడు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ముడిచమురు ధర పెరగకపోయినా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచిందని గుర్తు చేశారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నమో అంటే నమ్మించి మోసం చేయటమే అన్నట్టుగా మోడీ పాలన ఉందంటూ ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు ధరలు పెంచినా .. ఏమీ కాదనే ధీమాతో బీజేపీ ఉందని విమర్శించారు. కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల డబ్బుతో ఓట్లు కొనగలమనేది ఆ పార్టీ ధీమా అని తెలిపారు. మునుగోడు ఓటర్లు ప్రగతికి పట్టం కడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో తమతో కలిసి నడిచిన సీపీఐ (ఎం), సీపీఐ నేతలకు కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.