Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ విద్యాసంవత్సరానికే వర్తింపు
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక గుర్తింపును ప్రకటించింది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరానికే దీన్ని వర్తింపచేయడం గమనార్హం. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ పాఠశాలలో ఎల్కేజీ బాలికపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఆ పాఠశాలకు గుర్తింపును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. అయితే ఆ పాఠశాలను నడిపేందుకు విద్యాశాఖ కొన్ని సూచనలు చేసిందనీ, వాటిని పకడ్బందీగా అమలు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అయితే మూడు ప్రతిపాదనలను విద్యార్థుల తల్లిదండ్రుల ముందు విద్యాశాఖ ఉంచిందని వివరించారు. వాటిలో అదే పాఠశాలను అక్కడే కొనసాగించాలంటూ ఎక్కువ మంది తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే తల్లిదండ్రుల కోరిన విధంగా దుష్ప్రవర్తతో ఉన్న ఉపాధ్యాయులను తొలగించామని పేర్కొన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు చేసినందున ఈ విద్యాసంవత్సరానికే గుర్తింపు పునరుద్ధరిస్తున్నట్టు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనుమతి లేకుం డా ఆరు, ఏడు తరగతులను ప్రారంభించడంతోపాటు సీబీఎస్ఈని ప్రవేశపెట్టడం వంటివి ఆ యాజమాన్యం చేసిందని పేర్కొన్నారు.