Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయంగా కమ్యూనిస్టులకు అనుకూల వాతావరణం
- మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
- వ్యకాస మహాసభను విజయవంతం చేయండి : సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని, బి.వెంకట్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశంలోని ఆయా రాష్ట ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఎన్నికలను కూడా ఆ రకంగా ఉపయోగించుకోవాలని భావించిందన్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం కూడా దీనిలో భాగమేనని చెప్పారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో బుధవారం సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను సీపీఐ(ఎం) మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో కేసీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు దిగినా అది రిటైల్ వ్యవహారంగా సాగిందని, ఇప్పుడు బీజేపీ గంపగుత్తగా ఎమ్మెల్యేల కొనుగోలుకు పూనుకుంటోందని విమర్శించారు.
బీజేపీ పాలనలో జీడీపీ, విదేశీ మాదక ద్రవ్య నిల్వలు పడిపోయాయని తెలిపారు. గవర్నర్, ఇతర రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని రాష్ట్రాల హక్కులను హరించివేస్తోందని తెలిపారు. మతతత్వ బీజేపీకి గుణపాఠం చెప్పాలనే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామన్నారు. అంతేగానీ, ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్తోనైనా రాజీపడేది లేదన్నారు. రాజకీయంగా కమ్యూనిస్టులకు అనుకూల వాతావరణం ఉందన్నారు. డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం మహాసభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. 5వ తేదీన నిర్వహించే బహిరంగసభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరవుతున్నట్టు తెలిపారు. ప్రాంతీయ పార్టీలకు ఓ స్పష్టమైన విధానం ఉండదన్నారు. అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తాయని తెలిపారు. మూడేండ్లుగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. గతేడాదిగా ఆ బీజేపీ నుంచి ప్రతికూలత ఎదురవుతుండటంతో ఇప్పుడు టీఆర్ఎస్ మతోన్మాద వ్యతిరేక శక్తులను దగ్గరకు తీస్తోందన్నారు. దీనిలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులతో అవగాహనకు ముందుకొచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు దేశమైన చైనా కరెన్సీ యువాన్ పుంజుకుంటోందన్నారు. బ్రెజిల్ల్లోనూ పెట్టుబడిదారి ప్రభుత్వం కూలిపోయి లూలా నాయకత్వంలో కమ్యూనిస్టు సర్కారు అధికారంలోకి వచ్చిందన్నారు.
హిందూత్వం- కార్పొరేట్లకు అనుకూల విధానాలు అనుసరిస్తున్న బీజేపీని గద్దెదించేందుకు ఖమ్మంలో డిసెంబర్లో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ ఓ వేదిక కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్ అన్నారు. గతంలో జిల్లాలో జరిగిన కూలి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ మహాసభ విజయవంతానికి చేయాల్సిన కృషిని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. కరపత్రాలు, పోస్టర్లు, వాల్రైటింగ్లు, సోషల్మీడియా, ఇంటింటి ప్రచారం తదితర కార్యక్రమాలతో మహాసభపై విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు చెప్పారు. నవంబర్ 25-30 వరకు ప్రభాతభేరి, డిసెంబర్ 1న ముగ్గులు వేయాలన్నారు. మహాసభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు తగు సూచనలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్భివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ వివరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, బొంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, చింతలచెర్వు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.