Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
- 298 పోలింగ్ కేంద్రాలు
- 1199 మంది సిబ్బంది
- 3363వేల మంది పోలీసులు
- 15 కంపెనీల కేంద్ర బలగాలు..
నవతెలంగాణ- నల్లగొండ/ మిర్యాలగూడ/ నవతెలంగాణ సంస్థాన్ నారాయణపురం
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపే అవకాశముందంటూ ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మద్యం, డబ్బు పంపిణీ ఇతర ప్రలోభాలను అరికట్టేందుకు 50 ఫ్లయింగ్ స్వ్కాడ్స్‌ను నియమించింది. అలాగే, మునుగోడులో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2లక్షల 41వేల 855మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చండూరు డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించారు. మెటీరియల్ తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కు సిబ్బంది చేరుకున్నారు. నియోజకవర్గంలో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించగా, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 3366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలతో పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉపఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచించాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ప్రచారంలో దూసుకెళ్లాయి. దాదాపు రెండు నెలలుగా మునుగోడు నియోజకవర్గం హోరెత్తింది. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అన్ని పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాయి. 130 మంది నామినేషన్ వేయగా, 47మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రచారం గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులెవరూ మునుగోడులో ఉండొద్దని ఈసీ ఆదేశించింది. దీంతో అంతా మునుగోడు నియోజకవర్గాన్ని వీడారు. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 8కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 4వేల 500 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 185కేసులు నమోదు చేశారు. 111 బెల్టుషాపులు సీజు చేశారు. ఈ ఎన్నికల ఫలితం ఈనెల 6న తేలనుంది. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండొద్దని, పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించవద్దని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను పరిశీలించనున్నట్టు తెలిపారు.
సమస్యాత్మకమైన గ్రామాలు ఇవే..
నారాయణపురం మండలంలో :- నారాయణపురం, సర్వేలు గుజ్జ, జనగాం, పుట్టపాక, ఉర్లగడ్డ తండా, వాయులపల్లి.
చౌటుప్పల్ మండలంలో :- నేలపట్ల, చిన్న కొండూరు, ఎస్ లింగోటం ,పంతంగి, తాళ్ల సింగారం, తంగడపల్లి, ధర్మోజి గూడెం, నాగారం, మల్కాపురం. మునుగోడు మండలంలో :- మునుగోడు కొరటికల్, చొల్లేడు, ఇప్పర్తి, ఊకొండి, సింగారం, కలవలపల్లి.
చండూరు మండలంలో :- చండూరు, కస్తాల, అంగడిపేట, నిర్మల, ధోనిపాముల, గట్టుప్పల్, కమ్మ గూడెం, పుల్లెంల, శిర్ధపల్లి.
మర్రిగూడ మండలంలో:- చామలపల్లి, నామాపురం, సోమరాజు గూడెం అంతంపేట, కుదభక్షపల్లి, ఎర్రగండ్లపలి,్ల దామర భీమనపల్లి, శివన్న గూడెం, రామ్ రెడ్డిపల్లి, లెంకలపల్లి.నాంపల్లి మండలంలో:- నాంపల్లి, ముష్టిపల్లి, రేఖ తండా, పసునూరు, లక్ష్మణపురం, పెద్దపల్లి.