Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ జీ.. మీ ప్రాధాన్యతేమిటి..?
- బీజేపీని ఎటాక్ చేయకుండా మాపై దాడి చేస్తే ఏం ప్రయోజనం?
- ఉప ఎన్నిక తర్వాత 'మొయినాబాద్'పై మరిన్ని వీడియోలు, ఆడియోలు : మీడియాతో ఇష్టాగోష్టిలో రాష్ట్ర మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... రాజకీయ ప్రాధాన్యతలను గుర్తించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. దేశానికి మోడీ, బీజేపీ పెద్ద ఉపద్రవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆ పార్టీపై దాడి చేయకుండా టీఆర్ఎస్ను విమర్శించటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని చెప్పారు. త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్న గుజరాత్లో రాహుల్ యాత్ర చేయకపోవటంలోని ఆంతర్యమేంటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో కేటీఆర్ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన వివిధ ప్రశ్నలకు జవాబులిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాము నిలబెట్టిన మల్లిఖార్జున ఖర్గేకు ఓటేయాలంటూ సోనియా కుటుంబం కాంగ్రెస్ క్యాడర్ మొత్తానికి సంకేతాలిచ్చిందని అన్నారు. మరోవైపు శశి థరూర్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఇలాంటి అంతర్గత వ్యవహారాలున్న క్రమంలో వాటిని చక్కదిద్దకుండా రాహుల్... టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ను విమర్శించటం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం బయటపడటంతోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తన మునుగోడు పర్యటనను, అక్కడి బహిరంగ సభను రద్దు చేసుకున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు. బండారం బయటపడటంతోనే మోడీ రాష్ట్రానికి రాకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. మునుగోడులో ఓట్లను చీల్చేందుకే బీజేపీ రెండు పార్టీలను రంగంలోకి దించిందంటూ విమర్శించారు. ఆయా నేతలకు (ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కేఏ పాల్) అన్ని రకాలుగా ఆ పార్టీ అండదండలనిస్తోందంటూ పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఉప ఎన్నిక తర్వాత మరిన్ని ఆడియోలు, వీడియోలు బయటకు రానున్నాయని హెచ్చరించారు. ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నది మఠాధిపతులు కాదు.. వారు 'ముఠాధిపతులు...' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఎన్నికకు సంబంధించి బీజేపీ ఒక రోల్ బుక్ (కులం, మతం, ప్రాంతంతోపాటు వ్యక్తిగత బలహీనతల ఆధారంగా దెబ్బకొట్టటం)ను బయటకు తెస్తుందని కేటీఆర్ తెలిపారు. దాని ద్వారా ప్రత్యర్థి పార్టీలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుందని అన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆ రోల్ బుక్కు కాలం చెల్లిపోనుందని హెచ్చరించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తుందని వివరించారు. లోకసభ ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో టీఆర్ఎస్కు పట్టున్న ప్రాంతాల్లో అభ్యర్థులను నిలుపుతామని తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా లోక్‌సభ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి పని చేస్తుందని చెప్పారు. నాడు దేశానికి వలసొచ్చిన బ్రిటీష్ వారు మనల్ని పీల్చి పిప్పి చేశారనీ.. ఇప్పుడు అదే రీతిలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై... కలోనియల్ హ్యాంగోవర్ (వలసవాద వాసనలు- బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నారు)లా పని చేస్తున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు.