Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా నుంచి రాష్ట్రానికి చేరుకున్న కోమటిరెడ్డి
- ఏఐసీసీ షోకాజ్‌కు సమాధానమిస్తారా? బీజేపీలోకి వెళతారా?
- కాంగ్రెస్ గెలువదంటూ హాట్ కామెంట్లు
- 'మునుగోడు' ప్రచారానికి వెంకట్‌రెడ్డి దూరం..
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్త్రేలియా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్యం ముగిసిన తర్వాత నగరానికి చేరుకోవడంతో 'అన్నయ్య వచ్చాడో' అంటూ పార్టీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి పట్టుబట్టి టికెటు ఇప్పించిన వెంకట్‌రెడ్డి...ఆ తర్వాత ప్రచారానికి దూరంగా ఉండటం, అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదంటూ ఆయన హాట్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. సొంత తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరోక్షంగా వెంకట్‌రెడ్డి సహకరిస్తున్నారనే ప్రచారం కొనసాగింది. మునుగోడులో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నాయకులతో ఫోన్లో మాట్లాడి తమ్ముడికి ఓటేయాలంటూ బెదిరించారనే ఆడియోలు లీకయ్యాయి. పార్టీ సీనియర్ నాయకుడిగా, ఎంపీగా ఉంటూ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించడం పట్ల అధిష్టానం సీరియస్ అయింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆయనకు ఏఐసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే సమాధానమివ్వకుండానే ఆయన కుటుంబసమేతంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అక్కడ తన సన్నిహితులు, అభిమానులతో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదనీ, అందుకే తాను ప్రచారానికి పోవడం లేదంటూ చేసిన కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం నాటికి పది రోజులు పూర్తయ్యాయి. ఇంతవరకు షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇవ్వలేదు. క్లిన్చీట్ ఇచ్చే వరకు ఎవర్నీ కలవబోనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి మాత్రమే గెలిపిస్తారనీ, తనతో పనేంటి? అంటూ ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. తమ్ముడి దారితో నడుస్తూ...బీజేపీలోకి పోతారా? లేక తన తప్పును ఒప్పకుని పార్టీలో కొనసాగేందుకు ఏఐసీసీకి వివరణ ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఎన్నిక ఫలితాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకుంటారా? లేదో అనేది వేచి చూడాల్సిందే.