Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో ఆ భయం పోగొట్టేందుకే జోడో యాత్ర
- ప్రభుత్వరంగ సంస్థలు భారత్‌కు మూలధనం
- బీహెచ్ఈఎల్, బీడీఎల్‌ను అమ్మనీయం
- కుటుంబానికి కేసీఆర్.. మిత్రులకు మోడీ దోచిపెడుతుండ్రు :రాహుల్ గాంధీ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలోని వివిద వర్గాల ప్రజల్లో భయోత్పాతం సృష్టించడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్షమని, ఆ భయాన్ని పోగొట్టేందుకే భారత్ జోడో యాత్ర చేస్తున్నానని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జోడో యాత్ర బుధవారం 14 కిలో మీటర్ల మేర సాగింది. సాయంత్రం ముత్తంగి వద్ద నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషం, హింసను ప్రేరేపించి ప్రజల్లో భయాందోళన నెలకొల్పేందుకు పూనుకుంటున్నా యన్నారు. కార్మికులు, యువత, రైతులు ఇలా అన్ని తరగతుల ప్రజలతో మాట్లాడుతున్నానని, వారిలో ఏదో ఒక భయం వ్యక్తమవుతుందని చెప్పారు. బీహెచ్ఈఎల్ ఉద్యోగులతో మాట్లాడానని, వాళ్ల మనసుల్లో బీజేపీ పట్ల భయం వ్యక్తమైందన్నారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ లాంటి సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రధాని మోడీ పూనుకుంటున్నారని విమర్శించారు. ఈ దేశానికి ఆకాష్, పృద్వీలాంటి మిస్సెల్స్ తయారు చేసిన సంస్థల్ని ప్రయివేట్ శక్తులకు దారాదత్తం చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు దేశానికి మూలధనం లాంటివన్నారు. వాటిని అమ్ముతున్న బీజేపీ ఆటల్ని సాగనీయబోమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజల సంపద అని ఎవరి సొత్తూ కాదన్నారు. నిరుద్యోగుల్లోనూ ఏదో భయం కనిపిస్తుందన్నారు. ఇంజినీరింగ్ చదివిన వాళ్లను ఏం పని చేస్తున్నారని అడిగితే.. చదివిన చదువుకు తాము చేసే పనికి సంబంధం లేదని చెప్పారంటే ఈ దేశ యువ శక్తిని ఎంత నిర్వీర్యం చేస్తున్నరో అర్థమవుతోందన్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ దోపిడీ చేస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ తన మిత్రులకు దోచిపెడుతుండగా.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల్ని పెంచుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పుడు విధానాల వల్ల చిరు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు దెబ్బతిని ఉపాధి కోల్పోయేలా చేశారన్నారు. మద్యం, భూముల అమ్మకాలు, ప్రాజెక్టుల రీడిజైన్ల పెంపుతో కమీషన్ల రూపంలో కేసీఆర్ ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో నెలకొల్పుతున్న భయాన్ని తొలగించడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ధరల్ని నియంత్రించడం భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షలు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్, దామోదర రాజనర్సింహ్మ, గీతారెడ్డి, గాలి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.