Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 118 కింద కనీస చార్జీతో రిజిస్ట్రేషన్ : మంత్రి కేటీఆర్ వెల్లడి
నవతెలంగాణ -ఎల్బీనగర్
ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి తదితర హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ, యూఎల్సీ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి జీవో 118 కింద కనీస చార్జీతో వాటిని క్రబద్ధీకరించుకోవచ్చని చెప్పారు. బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ''మన నగరం'' కార్యక్రమం బహిరంగ సభలో ఐటీ, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 118 జీఓ కాపీని చూపించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చేయడానికి జీఓ 118 విడుదలకు కొంత సమయం తీసుకున్నామని చెప్పారు. దీంతో 6 నియోజకవర్గాల్లోని 44 కాలనీల వాసులకు తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు. గత పాలకులు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చి.. ఇండ్లు నిర్మించుకున్నాక నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులు పెట్టారన్నారు.
2007 నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కోసం ప్రజలు పోరాడుతున్నారన్నారు. తమ పిల్లల కోసం ప్లాట్, ఇండ్లు అమ్ముకోలేని పరిస్థితి ఎల్బీనగర్లో నెలకొన్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈ రిజిస్ట్రేషన్ సమస్య వచ్చిందని.. ఈ జీఓతో అన్ని సమస్యలూ తొలిగిపోయాయన్నారు. గజానికి రూ.250తో ఇంటి స్థలాలు రెగ్యులైజేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 100 గజాల నుంచి 1000 గజాల వరకు క్రమబద్ధీకరించుకోవచ్చని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 36 కాలనీ వాసుల రిజిస్ట్రేషన్ సమస్యకు 118 జీఓ వల్ల ముగింపు పలికామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో ప్లైఓవర్లు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. రూ. 450 కోట్లతో వరద నీటి కాల్వల నిర్మాణం జరుతోందన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరినప్పుడు రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేయాలని కోరారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సమస్య పరిస్కారానికి జీఓ తీసుకొచ్చి ఎల్బీనగర్ ప్రజలకు తీపి కబురు అందించామన్నారు. అయితే, కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆలస్యం అయిందని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల గుండె చప్పుడు విన్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించారన్నారు. అలాగే పత్తులగుడ, ఇంద్రసేనరెడ్డి నగర్లో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని మంత్రిని కోరారు. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు తీసుకు రావాలని కోరారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పాత పోచంపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. దాంతోపాటు డబుల్ బెడ్ రూమ్‌లు పేదలకు ఇవ్వాలన్నారు. ఈ సభలో మంత్రులు మహమ్మద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పురపాలక
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేషం, దయానంద్ గుప్తా, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ పంకజం, హయత్ నగర్ డిప్యూటీ కమీషనర్ మారుతీ దివా కర్, ఎల్బీనగర్ డిప్యూటీ కమీషనర్ సురేందర్‌రెడ్డి, సరూర్ నగర్ డిప్యూటీ కమీషనర్ కృష్ణయ్య, చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.