Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల భద్రత కోసం పటిష్ట చర్యలు
- సర్కారు సమాలోచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలలకు చెందిన బస్సుల్లో సీసీ కెమెరాలను ఉంచాలని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థిపై ఇటీవల లైంగిక దాడి ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం స్పందించి ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. అయితే విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు డీఏవీ పాఠశాలకు తాత్కాలిక గుర్తింపును ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రస్తుత విద్యాసంవత్సరం వరకే వర్తింపచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయివేటు పాఠశాలలకు చెందిన బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా బాలికల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నది. ఇందుకు సంబంధించి యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసే అవకాశమున్నది. ఈ నిర్ణయం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నది. అయితే యాజమాన్యాల నుంచి వచ్చే స్పందనను బట్టి ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచా లేదంటే వచ్చే విద్యాసంవత్సరం నుంచా? అన్నదానిపై స్పష్టత రానుంది. రాష్ట్రంలో 41,392 పాఠశాలల్లో 59,46,084 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 11,151 ప్రయివేటు స్కూళ్లలో 28,65,492 (48.19 శాతం) మంది విద్యార్థులున్నారు.