Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదోతరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి ఏటా ఆరు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయనీ, వాటిని డీఈవోలు, ఆర్జేడీలతోపాటు మోడల్ స్కూళ్లు, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎంఆర్ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (టీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జోతిబాఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), కేజీబీవీల హెచ్వోడీలు అమలు చేయాలని కోరారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. అయితే కరోనా రెండోవేవ్ విజృంభించడంతో 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. గత విద్యాసంవత్సరంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో 70 శాతం సిలబస్‌తోనే పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించి నిర్వహించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో వందశాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధిస్తున్నారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఏటా 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-2) పరీక్షలనూ ఆరు పేపర్లతోనే నిర్వహించాలని కోరారు. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాష, ద్వితీయ భాష, తృతీయ భాష, మ్యాథ్స్, సైన్స్ (జనరల్ సైన్స్, బయలాజికల్ సైన్స్), సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉండనుంది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు గడువు ఈనెల 15 వరకు ఉన్నది. ఆలస్య రుసుం రూ.50తో వచ్చేనెల 30 వరకు, రూ.200తో డిసెంబర్ 15 వరకు, రూ.500తో అదేనెల 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశమున్నది. పదో తరగతి పరీక్షలు, ఇతర సమాచారం కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.