Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్సాహంగా కొనసాగిన భారత్ జోడో యాత్ర
- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు
- బాలానగర్ నుంచి పటాన్చెరు వరకు అడుగడుగునా జన నీరాజనం
నవతెలంగాణ- సిటీబ్యూరో, బాలానగర్, కేపీహెచ్‌బీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గ్రేటర్ హైదరాబాద్‌లో రెండో రోజూ ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, యువత, జనం పోటెత్తడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళా ప్రదర్శనలతో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. బాలానగర్ నుంచి పటాన్చెరు వరకు రాహుల్ పాదయాత్ర సాగింది. యాత్ర మధ్యలో పలుచోట్ల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో బాలీవుడ్‌కు చెందిన సినీనటి పూజాభట్ రాహుల్‌ను కలిశారు. కొద్దిదూరం నడిచారు. అదేవిధంగా వివిధ సంఘాల నేతలు, మేధావులు కూడా రాహుల్‌ను కలిశారు. బుధవారం ఉదయం 6 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. న్యూబోయిన్‌పల్లి, బాలానగర్, సుమిత్రానగర్, ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మియాపూర్‌లోని ఇందిరానగర్ కాలనీ, బీహెచ్సీఎల్ మీదుగా పటాన్చెరు వరకు దాదాపు 28 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రసంగించారు. ఏసీపీ గంగారాం, సీఐ కె.భాస్కర్ పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, పటాన్చెరు వైపు యాత్ర సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముత్తంగిలో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించడంతో పటాన్చెరు వైపు దాదాపు ఐదు కిలోమీటర్లు వాహనాలు నిలిచాయి. సంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత నడిచే క్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి గాయపడ్డారు.