Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత కార్యక్రమాల సమీక్ష...భవిష్యత్ పోరాట కార్యాచరణ
- నగరానికి చేరుకున్న 29 రాష్ట్రాల ప్రతినిధులు
- నేటి నుంచి హైదరాబాద్లో మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల హక్కులను పోరాడి సాధించటానికి హైదరాబాద్ వేదిక కానున్నది. ఆలిండియా మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ రెండో జాతీయ మహాసభలు శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సభలకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదిక కానున్నది. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రారంభ సభ నిర్వహించనున్నారు. మహాసభల్లో భాగంగా ముందుగా సీఐటీయూ జెండావిష్కరణ, అనంతరం జరిగే ప్రారంభ సభలోఆహ్వాన సంఘం చైర్మెన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రిసెప్షన్ కమిటీ వైస్ చైర్మెన్ చుక్క రాములు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు ప్రసంగిస్తారు. మహాసభల్లో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి ఎ.ఆర్.సింధు, ఆల్ ఇండియా మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎస్.జై భగవాన్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు తదితరులు పాల్గొంటారు.29 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరవుతారు.
గత మహాసభల నుంచి ఈ మహాసభల వరకు నిర్వహించిన కార్యక్రమాలను ప్రతినిధులు సమీక్షించనున్నారు. భవిష్యత్ పోరాటాలు, వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పథకాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న కుట్రలు తదితర అంశాలను చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రం మధ్యాహ్న భోజన వితరణ బాధ్యతలను వర్కర్ల నుంచి స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తుండటంతో ఇటు వర్కర్ల నుంచి నాణ్యమైన భోజనం అందక పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు పిల్లలకు భోజనం బదులుగా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలనే యోచన చేస్తుండటంతో వర్కర్లకు ఉపాధి పోవడంతో పాటు పిల్లలకు పోషకాహార సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గత 15 ఏండ్లుగా ఇలాంటి ప్రయత్నాలు జరగుతున్నా బీజేపీ అధికారంలోకి వచ్చాక మరీ ముమ్మరం చేయడంతో వర్కర్లలో ఆందోళన పెరిగింది. స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన బాధ్యతను అప్పగించిన తర్వాత ఆహార నాణ్యత బాగుండటం లేదనీ, స్థానికంగా వర్కర్ల చేత వండించినప్పుడే బాగుందంటూ కాగ్ నివేదిక సైతం తేల్చడం గమనార్హం. ఎన్జీవోలు పెద్ద మొత్తంలో వండాల్సి రావడం, ఎక్కువ మందికి సరఫరా చేస్తుండటంతో అప్పటికే ఆహార నాణ్యత దెబ్బతింటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్న భోజనం పిల్లలకు పోషకాహారంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెంచే మంచి పథకంగా పేరుగాంచింది. అయితే అదే స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇస్తుండటం, పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను తీసుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న మహాసభలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్మికులుగా గుర్తించాలి : ఎస్వీ రమ
మధ్యాహ్న భోజన వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మహాసభల ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. ఆయా రాష్ట్రాల నుంచి మహాసభలకు విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై మహాసభల్లో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వర్కర్లకు నెలకు రూ.1,000 చొప్పున అది కూడా ఏడాదికి 10 నెలలు మాత్రమే చెల్లించడం తీవ్ర అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పొడువునా జీతం ఇవ్వాలనీ, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఉధృత పోరాటాలకు మహాసభలు నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.