Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణతోపాటు ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చే కుట్ర...వీడియోలో స్పష్టంగా ఉంది
- బీజేపీ అరాచకాండను అడ్డుకుని దేశాన్ని రక్షించండి : న్యాయవ్యస్థకు సీఎం కేసీఆర్ అభ్యర్ధన
- ఎమ్మెల్యేల ఎరకు సంబంధించిన కీలక వీడియో విడుదల
- ఇక విస్ఫోటనం చూస్తారంటూ బీజేపీ నేతలకు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా డైరెక్షన్లోనే ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని, తెలంగాణ,ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్ర పన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించారనీ, తుషార్, బిఎల్ సంతోష్ ఆయనకు అన్ని విషయలనూ వివరించారని చెప్పారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మీడియా సమక్షంలో సీఎం బయటపెట్టారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రగతిభవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన...ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం నిర్లజ్జగా, విచ్చలవిడిగా హత్య కాబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హంతకుల స్వైరవిహారం దేశానికే ప్రమాకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలను కూల్చడం ఊహకందని దుర్మార్గమన్నారు. దేశాన్ని బీజేపీ అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను విభజిస్తూ ప్రజాస్వామ్య జీవనాడిని దెబ్బతీసేలా క్రూరమైన కుట్రలు చేస్తోందన్నారు.
'మీ ఎమ్మెల్యేలు 40మంది నాతో టచ్లో ఉన్నారు...' అంటూ ప్రధాని మోడీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి అనడం ఏం విధానమని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బ్రోకర్లు పలు సార్లు అమిత్ షా, మోడీ పేర్లు ప్రస్తావించటాన్ని ఏమని అర్ధం చేసుకోవాలంటూ నిలదీశారు. విపక్షాల ఎమ్మెల్యేలను వందల కోట్లకు కొనుగోలు చేస్తున్న బీజేపీకి అంత ధనం ఎక్కడి నుంచి వస్తుంది..? ఎవరు సమకూరుస్తున్నారు..? వీరి వెనక ఎవరున్నారో తేల్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలను ఆయన కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోలు, నిందితుల కాల్ రికార్డు, వారు ఉపయోగించిన నకిలీ పత్రాలను సీజేఐ, న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రులు, సీబీఐ, ఈడీ, సీవీసీతోపాటు దేశంలోని అన్ని మీడియా సంస్థలకు పంపినట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న ప్రతివ్యక్తీ బీజేపీ ఘాతుకాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హోం మంత్రి అమిత్ షా మునుగోడు వచ్చిన సందర్భంగా నెల రోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బాహాటంగా ప్రకటించడం ఎలాంటి అహంకారానికి నిదర్శనమని ప్రశ్నించారు. బీజేపీ కొనసాగిస్తున్న రాజకీయ హననాన్ని అడ్డుకోకుంటే దేశ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. ఆ పార్టీ బ్రోకర్ రామచంద్రభారతి కుట్ర అర్థమైన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తమకు సమాచారం ఇచ్చారనీ, దీనిపై హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వాలను కూల్చాలనే బీజేపీ రాక్షసుల కుట్రను తెలంగాణ గడ్డ బద్దలు కొట్టిందన్నారు.
ఐటీ, ఈడీ, వై క్యాటగిరీ భద్రత...అంటూ రాజ్యాంగేతర శక్తులు చెబుతుండటాన్నిబట్టి దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు చెప్పిన తుషార్ అనే వ్యక్తి కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ తరపున పోటీ చేశారనీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఈ కేసులో నిందితులకు నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఏవిధంగా వచ్చాయని ప్రశ్నించారు. దీన్ని ఒక్క కేసుగానే చూడొద్దనీ, సంపూర్ణంగా విచారించాలని కేసీఆర్ కోరారు.
ఈవీఎంలు ఉన్నంతకాలం బీజేపీకి ఢోకాలేదని నిందితులు అంటున్నారంటే వీరి వెనక గట్టి ముఠానే పనిచేస్తుందని, అవన్నీ తేలాల్సి ఉందన్నారు. దేశంలో అనేక సమస్యలుంటే వాటిని పక్కనబెట్టి ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. మఠాధిపతులు, స్వాముల ముసుగులో ఏం చేస్తున్నారో దేశం చూస్తోందనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు. జయప్రకాశ్ నారాయణ నడిపిన ఉద్యమంలాంటి మరో ఉద్యమాన్ని దేశం చూడబోతున్నదని హెచ్చరించారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలగొట్టింది..ఎమ్మెల్యేల తరలింపు..నగదు పంపిణీ విషయాలను వీడియోలో నిందితులు బహిరంగంగా చెప్పారని వివరించారు. దేశంలో ఇలాంటి కిరాతక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో భారత ప్రభుత్వం ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా నిబంధనల మేరకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లో కలుపుకున్నాం తప్ప బీజేపీలాగా కొనుగోలు చేయలేదని వివరణిచ్చారు. తెలంగాణకు వచ్చి తమ ప్రభుత్వాన్నే కూల్చేందుకు కుట్రలు చేస్తే చేతులు ముడుచుకుని ఊరుకోవాలా..? నిశ్శబ్దంగా భరించాలా..?అని సీఎం ప్రశ్నించారు.
ఇక విస్పోటనం చూస్తారంటూ బీజేపీ నేతలనుద్దేశించి కేసీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకతీతంగా అందరూ కలిసి కొట్లాడారని గుర్తుచేశారు. రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టిన మోడీకి ఇంకేం కావాలంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సుప్రీంకోర్టు సీజే, న్యాయమూర్తులు, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.