Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 270 మంది రైతులు.. 512 ఎకరాల సాగు
- సాగుదారుల అధీనంలో ఉన్నట్టు జాయింట్ సర్వేలో గుర్తింపు
- పట్టాల కోసం దరఖాస్తు చేసిన రైతులు
- టేక్మాల్ మండలం దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయని అధికారులు
- ఫారెస్టోళ్ల దౌర్జన్యం : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పోడు భూములకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సాగుదారులు సంతోషపడ్డా టేక్మాల్ ప్రాంత గిరిజన బిడ్డలకు అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరాశ ఎదురవుతోంది. 270 మంది సాగుదారుల దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. మరోపక్క భూముల్లోకి రావద్దంటూ ఫారెస్టోళ్లు దౌర్జన్యం చేస్తున్నారు. ఏండ్ల తరబడి సాగు చేస్తున్న భూములు తమకు దక్కకుండా జరుగుతున్న కుట్రల్ని గమనించని గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టేక్మాల్ మండలంలో పోడు భూముల సమస్యపై నవతెలంగాణ క్షేత్ర పరిశీలన.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని చంద్రు తండా, లక్ష్మణ్ తండా, వసురాం తండాలకు చెందిన గిరిజనులు, అచ్చన్నపల్లికి చెందిన దళితులు పోడు భూముల్ని సాగు చేసుకుంటున్నారు. దట్టమైన అడవీ, ఎత్తైన గట్లను చదును చేసి సాగుకు వీలుగా మార్చుకున్నారు. చంద్రు, లక్ష్మణ, వసురాం తండాలకు చెందిన 220 మంది గిరిజనులు, అచ్చన్నపల్లికి చెందిన 50 మంది దళితులు ఎన్నో ఏండ్లుగా 512 ఎకరాల పోడు భూముల్ని సాగు చేస్తున్నారు. వర్షాధారంగా మక్కలు, ఉలువలు, కంది వంటి మెట్ట పంటలేస్తున్నారు. పశువులు, మేకలు, గొర్రెల్ని పోషణ చేస్తూ బతికేస్తున్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని 2005 నుంచి కోరుతున్నారు. అటవీ హక్కుల చట్టం వచ్చాక కూడా రైతులకు పట్టాలివ్వలేదు. ఇటీవల సాగుదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో నాలుగు గ్రామాల రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయని వైనం
చంద్రు, లక్ష్మణ్, వసురాం తండాలతో పాటు అచ్చన్నపేట గ్రామాలు టేక్మాల్ మండలంలో ఉన్నాయి. బౌగోళికంగా తమ గ్రామాల సరిహద్దులో ఉన్న పోడు భూములు కావడంతో రైతులు గ్రామ సభల్లో టేక్మాల్ మండలంలోని చంద్రు, లక్ష్మణ్, వసురాం తండాల నుంచి దరఖాస్తు చేశారు. 270 మంది రైతులు గ్రామ సభలో పాల్గొని పంచాయతీరాజ్ సెక్రటరీకి దరఖాస్తులు అందజేశారు. వాటిని పరిశీలించి ఆన్లైన్ చేస్తామని చెప్పారు. దాంతో తమకు పట్టా వస్తుందని సాగుదారులు ఆశపడ్డారు. కానీ.. ఆ నాలుగు గ్రామాల రైతుల దరఖాస్తులు చెత్తబుట్టకే పరిమితమయ్యాయి. పంచాయతీ కార్యదర్శి వద్దనే ఉన్నాయి. అర్హులైన రైతుల జాబితాలో ఆ నాలుగు గ్రామాల రైతుల పేర్లు లేవు. కారణమేంటని తెలుసుకుంటే టేక్మాల్ మండలం పేరు కంప్యూటర్లో లేనేలేదని, మీ దరఖాస్తుల్ని ఎలా ఆన్లైన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. పోడు దరఖాస్తుల స్వీకరణ కోసం తయారు చేసిన సాప్ట్‌వేర్‌లో టేక్మాల్ మండలంలోని చంద్రు, లక్ష్మణ్, వసురాం తండాల పేర్లు లేవు. ఈ నాలుగు గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్న 512 ఎకరాల భూమి పక్కనే ఉన్న పాపన్నపేట మండలంలోని నామవరం రెవెన్యూ శివారుగా రికార్డులో ఉంది. నామవరం పేరిట దరఖాస్తు చేస్తేనే కంప్యూటర్ అంగీకరిస్తుంది. ఈ విషయం తెల్వని గిరిజనులు తమ గ్రామం, మండలం పేరిటనే దరఖాస్తులు ఇచ్చారు. భూములు తమ ఊర్ల పరిధిలో ఉన్నందున ఆ ఊర్ల పేరిటే దరఖాస్తు చేశారు. అధికారులు మాత్రం టెక్నికల్ సమస్యను చూపి దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయకుండా పక్కన పడేశారు.
512 ఎకరాలు సాగుదారుల ఆధీనంలో ఉన్నట్టు గుర్తించిన జాయింట్ సర్వే
పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న రైతుల భూముల్ని నిర్ధారించేందుకు అప్పటి ఆర్డీఓ వనజాదేవీ సమక్షంలో పారెస్ట్, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే చేశారు. చంద్రు, లక్ష్మణ్, వసురాం తండాలు, అచ్చన్నపేట గ్రామ రైతుల ఆధీనంలో 512 ఎకరాల పోడు భూములున్నాయని సర్వేలో నిర్ధారించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చారు. 270 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టాలివ్వలేదు. ఇప్పడేమో టేక్మాల్ మండలంలోని ఆ నాలుగు గ్రామాల రైతుల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కాలేదన్న నెపంతో పట్టాలివ్వడం కుదరని అధికారులు చెబుతున్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు
పోడు భూములు సాగు చేసుకుంటున్న టేక్మాల్ మండల రైతులకు అన్యాయం జరుగుతుంది. గిరిజన, దళిత రైతులు సకాలంలో దరఖాస్తు చేసుకున్న ప్పటికీ వాటిని ఆన్లైన్ చేయకపోవడం అన్యాయం. వాళ్ల నివాస గ్రామంలో ఉన్న పోడు భూముల్ని సాగు చేసుకుంటున్నందున అక్కడి పేరుతో దరఖాస్తు చేశారు. కంప్యూటర్లో మాత్రం టేక్మాల్ మండలంలోని గ్రామాలు లేవని చెప్పి తిరస్కరించడం సరికాదు. పక్కన ఉన్న నామవరం రెవెన్యూ శివారు పేరిట దరఖాస్తు చేసుకోవాలనే విషయం రైతులకు తెల్వదు. జిల్లా కలెక్టర్ పరిశీలించి రైతుల దరఖాస్తుల్ని ఆన్లైన్ చేసి అర్హుల జాబితాలో చేర్చాలి. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. రెండు సార్లు ధర్నా చేశాం. జాయింట్ మీటింగ్ పెట్టి దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయడంతో పాటు రైతులకు పట్టాలివ్వాలి.
- మల్లేశం, సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శి
పశువులు మేపినా దాడి చేస్తుండ్రు
మూడు తరాలుగా పోడు భూములను సాగుచేసుకుంటూ బతుకుతున్నం. మాకు పశుపోషణే జీవనాధరం. వాటిని మేపుకోవడం కోసం పోడు గేట్లకు వెళ్లిన నాపై పారెస్టోళ్లు విపరీతంగా కొట్టిండ్రు. కాళ్లవేళ్లా పడినా వదలలేదు. వళ్లంతా వాతలు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. అడవే మాకు జీవనాధారం. హక్కు కల్పించి ఆదుకోవాలి.
- లకావత్ కవిత, మహిళా రైతు చంద్రూతండా
20 ఏండ్లుగా సాగు చేస్తున్నం
20 ఏండ్లుగా పోడు భూముల్ని సాగు చేస్తున్నం. దట్టమైన అడవీ ప్రాంతం. ఎత్తైన ఏనేలు, రాళ్లుండేవి. వాటిని చదును చేసి పంటలేసు కుంటున్నం. నీటి వసతి లేక మెట్టపంటలైన కంది, ఉలువలు, ఇతర పంటేస్తం. భూముల్లోకి వెళ్లితే రావద్దంటున్నారు. హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసినం. మొదట్లో సర్వే చేసి మేము సాగు చేస్తున్నట్టు రాసుకుండ్రు. ఇంత వరకు పట్టాలివ్వట్లేదు.
- రమావత్ నామ, గిరిజన రైతు
దరఖాస్తుల్ని ఆన్లైన్ చేయకపోవడం అన్యాయం
గ్రామ కమిటీ వేసిండ్రు. పోడు భూములు చేసుకుంటున్న వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిండ్రు. మేమంతా దరఖాస్తు చేసినం. వాటిని కంప్యూటర్లో ఎక్కించలేదని చెబుతున్నారు. మా ఊరిలో ఉన్న పోడు భూముల్ని మేము సాగు చేసుకుంటున్నం. దరఖాస్తుల్లో పక్క ఊరైన నామ వరం పేరు లేదని మా దరఖాస్తుల్ని ఎట్ల పక్కన పెట్టిండ్రు. మా దరఖాస్తుల్ని ఆన్లైన్ చేసి అర్హుల జాబితాలో మా పేర్లు చేర్చాలి. లేదంటే భూముల కోసం పోరాడుతాం.
- కోట్రాత్ గోపాల్, పోడు రైతు