Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్' ప్రారంభోత్సవంలో ఆర్టీసీ చైర్మెన్, ఎండీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఆర్టీసీ బాగుంటుందని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్డీ సజ్జనార్ తెలిపారు. ఆ ఉద్దేశంతోనే హెల్త్ డ్రైవ్‌ను చేపట్టినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నెలంతా కొనసాగే 'గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్'ను గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో చైర్మెన్, కాచిగూడ బస్‌స్టేషన్‌లో ఎమ్డీ ప్రారంభించి అక్కడే వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవువుతుండటంతో వారి సంక్షేమం కోసం ఆరోగ్య ప్రొఫైల్‌ను నిక్షిప్తం చేయడానికి అన్ని డిపోలు, యూనిట్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్తపోటు, సాధారణ ప్రాథమిక పరీక్షలతో పాటు కంటి పరీక్ష, ఈసీజీ, కొలెస్ట్రాల్, క్రియాటినిస్ సీరం వంటి 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బ్యాచ్‌ల వారీగా మెడికల్ చెకప్ కోసం హాజరయ్యే ఉద్యోగులకు డిపో మేనేజర్లు, యూనిట్ అధికారులు ముందుగానే ప్రణాళికను రూపొందించారన్నారు. వైద్య శిబిరం దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆరోగ్య శిబిరం దగ్గర ఒక నోడల్ అధికారి సమన్వయకర్తగా, పరీక్షలకు విచ్చేసిన ఉద్యోగులు నిరీక్షించే సమయంలో బీపీ, మధుమేహం, తదితర ఆరోగ్య సమస్యలపై వీడియోలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. పరీక్షల అనంతరం రెండు రోజుల తరువాత నివేదికలు వ్యక్తిగతంగా ఉద్యోగులకు పంపడమే కాక వైద్యులు తగిన సూచనలు చేస్తారని చెప్పారు. అంతే కాకుండా యోగా, ఆహార నిబంధనలపై అవగాహన కూడా కల్పిస్తారని చెబుతూ వ్యాయామాన్ని ఉద్యోగులు రోజు వారీ దిన చర్యలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు రోజు క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఆరోగ్య విషయంలోనూ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామనీ, బకాయి ఉన్న డీఏలలో గడిచిన సంవత్సర కాలంలో అంతకు ముందు 2, ఇప్పుడు 3 డి.ఎలను చెల్లిస్తున్నదని తెలిపారు. సంస్థ ఏ కార్యక్రమం తలపెట్టినా ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకొని వాటిని విజయవంతం చేస్తున్నారంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆరోగ్యం విషయంలో సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరించకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుంటే జీవన విధానం మెరుగుపడుతుందని సూచించారు. హెల్త్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొదటి వారంలో 2 వేల అడుగులు, రెండవ వారంలో 5 వేల అడుగులు, మూడో వారంలో 7 వేల అడుగులు, నాలుగో వారంలో 10 వేల అడుగులతో నడకను పూర్తి చేసిన ఉద్యోగులకు ప్రత్యేకంగా రివార్డులు ఇస్తామని జరుగుతుందని వివరించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్టు తెలిపారు.