Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి(90) హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. 1932, అక్టోబర్ 15న ఆయన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గోవర్ధన కృష్ణమాచార్యులు, కమ్మ దంపతులకు జన్మించారు. 1954లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) నుంచి బీఏ పట్టా పొందారు. 1956లో జర్నలిజంలో పీజీ డిప్లొమా, 1959లో ఎల్ఎల్ల్బీ పూర్తి చేశారు. వరదాచారి నాలుగు దశాబ్ధాలపాటు మీడియారంగం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వరదాచారి 1955లో వైష్ణవపత్రిక నిర్వహణ ఆంధ్రజనతలో పనిచేశారు. అనంతరం 1956, జూన్ 24 నుంచి 1961, మార్చి మూడు వరకు ఆంధ్రభూమి దిన పత్రికలో సబ్ఎడిటర్గా చేరారు. ఆ తర్వాత 1982 నవంబర్ వరకు న్యూస్‌ఎడిటర్ బాధ్యతలను నిర్వర్తించారు. 1983 నుంచి 1988, డిసెంబర్ 22 వరకు ఈనాడులో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. 1988, డిసెంబర్ 23 నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. అన్ని దినపత్రికల జర్నలిజం కళాశాలల్లోనూ ఆయన బోధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమి శిక్షణా తరగతుల్లో 'పత్రికల భాష'అనే అంశంపై ఆయన ప్రసంగించారు. 2011లో హెచ్ఎంటీవీలో పనిచేశారు. పత్రికా రంగంలో విశేష కృషి చేసినందుకు తెలుగు విశ్వవిద్యాలయం 1999లో ప్రతిభా పురస్కారాన్ని అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారంతో స్వర్ణపతకాన్ని ప్రదానం చేసింది. వివిధ పత్రికల్లో సంపాదకీయాలు, వ్యాసాలు, లఘు వ్యాఖ్యలు, సమీక్షల సంకలనం, దిద్దుబాటు - పత్రికా రచనలో సాధారణంగా జరిగే పొరపాట్లపై సోదాహరణంగా రాసిన విమర్శనాత్మక వ్యాసాల సంపుటం వంటివి ప్రచురితమయ్యాయి. ఇలాగేనా రాయడం? - పత్రికలలో వచ్చే సంపాదకీయాలు, తదితర వ్యాఖ్యలలో కొరవడిన పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషించే వ్యాసాలను సంకలనం చేశారు. 1962-64 వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి కార్యదర్శిగా, 1964-66 వరకు ప్రధాన కార్యదర్శిగా, 1980-81 వరకు అధ్యక్షునిగా, 1963-64 కాలంలో ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శిగా, 1975-78 వరకు జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షునిగా, 1977 నుంచి ఏపీ సినీగోయర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా, 1986-90 వరకు జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా, 2001 నుంచి 2006 వరకు ఆ పదవిలో మళ్లీ కొనసాగారు. 2022 వరకు వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు.
సీనియర్ పాత్రికేయులు కెఎల్ రెడ్డి మరణం
సీనియర్ పాత్రికేయులు కంచర్ల లక్ష్మారెడ్డి (91) గురువారం వరంగల్‌లో మరణించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటినిజం, సాయంకాలం, మహానగర్ వంటి పత్రికల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.
సీఎం సహా పలువురి సంతాపం
జిఎస్ వరదాచారి, కెఎల్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సహా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మీడియా అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలురు గౌరీశంకర్, సంతాపం ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు దశాబ్ధాల పాటు జర్నలిజం రంగానికి సేవలందించారని సీఎం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కెఎల్ రెడ్డి సీనియర్ జర్నలిస్టుగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, పత్రికా రంగానికి అందించిన నిస్వార్థ సేవలను, సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిద్దరి మరణం జర్నలిజానికే తీరనిలోటని పేర్కొన్నారు. వృత్తి పట్ల నిబద్ధత గల కలంయోధులుగా చరిత్రలో నిలిచిపోతారని వివరించారు. వరదాచారి, కెఎల్ రెడ్డి మరణం పట్ల ఐటీయూ అధ్యక్షులు కె శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె విరాహత్అలీ, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, బి బసవపున్నయ్య దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.