Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగ్జిట్‌పోల్స్ అన్నింటా ఇదే అంచనా
- బీజేపీ గెలుపు గురించి ఏ సంస్థా చెప్పని వైనం
- హస్తం మూడో స్థానానికే పరిమితమంటూ ప్రచారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీలోని బీజేపీ అగ్ర నాయకత్వం ప్రోద్బలంతో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో కమలం డీలా పడింది. కమ్యూనిస్టుల మద్దతుతో బరిలోకి దిగిన కారు పార్టీ దెబ్బకు అది విలవిల్లాడింది. అభివృద్ధి కోసమే రాజీనామా అంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన జపాన్ని ప్రజలెవరూ నమ్మలేదు. సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారంతోపాటు ఓట్ల కోసం బీజేపీ వేసిన ఏ ఒక్క పాచికా అక్కడ పారలేదు. రాళ్లు రువ్వటాలు, పోలింగ్‌కు ముందు రోజు అర్థరాత్రి రాజగోపాల్‌రెడ్డి రాస్తారోకోలు కూడా ఆ పార్టీకి ఫలితానివ్వలేకపోయాయి. గురువారం నిర్వహించిన పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌లో ఇదే విషయం తేలింది. వాటి అంచనా ప్రకారం... మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి నిలవగా, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కోల్పోవటమేగాక ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానానికే పరిమితం కానున్నారని ఆయా సంస్థలు ఉటంకించాయి. పల్స్ టుడే, హెచ్ఎమ్ఆర్, సీటీవీ-న్యూస్, థర్డ్ విజన్ రీసెర్చి సర్వీసెస్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తదితర సంస్థల ఎగ్జిట్పోల్సన్నీ గులాబీ పార్టీ విజయాన్ని ఖరారు చేశాయి. ఆ పార్టీకి 42 నుంచి 43 శాతం మంది ఓటేశారని తేల్చేశాయి. బీజేపీకి 31 నుంచి 38 శాతం మధ్యలో ఓట్లు పడ్డాయని పేర్కొ న్నాయి. ఇక కాంగ్రెస్‌కు 14 నుంచి 23 శాతం మంది ఓటేశా రంటూ తమ తమ అంచనాలను వెల్లడించాయి. మొత్తం మీద టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఎనిమిది వేల నుంచి 10 వేల ఓట్ల మెజారిటీతో గెలు పొందనున్నారని ఆ సంస్థలు విశ్లేషించాయి. అయితే ఈ సంస్థల్లో ఏ ఒక్కటి కూడా బీజేపీకి గెలుపు అవకాశాలున్నాయని చెప్పకపోవటం గమనార్హం. మరోవైపు నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, గట్టుప్పల్, నారాయణపురం మండలాల్లోని అత్యధిక ఓటర్లు కారు గుర్తు వైపే మొగ్గు చూపారనీ, చండూరు టౌన్, చౌటుప్పల్‌లో కమలానికి కాస్త ఎక్కువ ఓట్లు పడ్డాయన్నది ఆయా సంస్థల అంచనా.