Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ భారత్‌గా మారుస్తున్న మోడీ
- లక్షలాది ఎకరాల భూముల కోసమే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ
- సంగారెడ్డి జిల్లాలో కొనసాగిన రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ముస్లింలపైనే కాకుండా హిందువుల్లోని దళితులు, గిరిజనులు, ఓబీసీలపైనా కక్ష ఉందని, అందుకే ఆ వారిపై దాడులు జరుగుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని గణేష్‌గడ్డ నుంచి శివ్వంపేట వరకు భారత్‌జోడో యాత్ర నిర్వహించారు. భోజన విరామ సమయంలో కొందరు ముస్లిం పెద్దలతో ఆయన మాట్లాడారు. దేశంలో ముస్లిం మైనార్టీలు ఎలా అభద్రతా భావానికి గురవుతున్నారనే విషయాలతో పాటు దాడులు, మైనార్టీ విద్యా సంస్థల మూసీవేత వంటి ఆంశాలను వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. పాదయాత్ర ముగిశాక సాయంత్రం శివ్వంపేట సెంటర్లో జరిగిన సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. అధికారం కోసం సమాజాన్ని విడదీస్తూ తమ విధానాలను కొనసాగిస్తోందన్నారు. భారత దేశ భవిష్యత్ ఏమిటీ? యువతకు ఉపాధి, పేదల సంక్షేమం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ధ్యాస మోడీకి లేదని విమర్శించారు. హింసను ప్రేరేపిస్తూ పాలిస్తున్న బీజేపీ నిరుద్యోగ భారత్‌గా మారుస్తోందన్నారు. యాత్రలో కలిసిన యువకులతో మాట్లాడితే ఇంజనీరింగ్ చదవి లేబర్‌గా లేదంటే ఉబర్, ఓలాలో పనిచేయడం తప్ప ఇంజినీర్‌గా ఉద్యోగం దొరికే పరిస్థితుల్లేవని చెబుతున్నారన్నారు. బీజేపీ తప్పుడు విధానాలతో ఉన్న ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా కొత్తగా ఉద్యోగాలివ్వడం లేదన్నారు. దేశంలో పాటు తెలంగాణలోనూ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వేరు కాదని, ఇద్దరూ కలిసే ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చంపివేయడమే వీరిద్దరి పని అని ఆరోపించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ విద్యా, వైద్యాన్ని ప్రయివేటుపరం చేస్తున్నారన్నారు. మోడీ ఫోన్ చేయగానే పార్లమెంట్లో అన్ని చట్టాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. దశాబ్దాలు శ్రమించి ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఓడీఎఫ్ లాంటి ప్రభుత్వ కంపెనీలను బీజేపీ ప్రయివేటీకరిస్తుందన్నారు. కేసీఆర్‌కు పొద్దున ప్రాజెక్టుల రీడిజైన్ చేసి కమీషన్లు తీసుకోవడం, రాత్రి ధరణీ పోర్టర్ చూసి భూముల్ని అమ్ముకోవడం ద్వారా కోట్లు దండుకుంటున్నారని చెప్పారు.
బీజేపీ పెంచుతున్న భయాన్ని తొలగించి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని స్పష్టంచేశారు. పాదయాత్రలో భాగంలో సంగారెడ్డి పట్టణంలో థింసా కళాకారులతో కలిసి రాహుల్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క నృత్యం చేశారు. నృత్యం గురించి సీఎల్పీ నేత బట్టి విక్రమాక్క రాహుల్‌కు వివరించారు. సభలో మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ నాయకులు మధు యాస్కీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, బోసు రాజు, కేసీ వేణుగోపాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భారత్‌జోడో యాత్ర మాస్ మూమెంట్
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మాస్ మూమెంట్ అని, ఇది చారిత్రక ఘట్టమని సీనియర్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాస్కీ అన్నారు. గురువారం వారు విలేకర్లతో మాట్లా డుతూ.. లక్షలాది మంది జనం భారత్‌జోడో యాత్రలో ఉత్సాహంతో పాల్గొంటున్నారని తెలిపారు. 57 రోజల పాటు సాగిన యాత్ర తెలంగాణలో 12వ రోజు కొనసాగిందన్నారు. ఐదు రాష్ట్రాలు, 23 జిల్లాల్లో 1,516 కిలో మీటర్ల మేర రాహుల్ యాత్ర చేశారని తెలిపారు.